– ఆ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. మంగళవారం హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని అన్ని రకాలుగా గౌరవించిన పార్టీని వీడటం ఆయనకే నష్టమని చెప్పారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడటం వారిని బాధించిందన్నారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్లు ఎంత పెద్ద వాళ్లైనా సరే వదిలిపెట్టేది లేదన్నారు. వారికి కార్యకర్తలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌లోకెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డిని కనీసం అడిగిన వాళ్లు కూడా లేని దయనీయ పరిస్థితి వచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి పరిపాలన సమర్థత ఏంటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. మార్పు పేరుతో జనాన్ని ఆయన ఏమారుస్తున్నారని మండిపడ్డారు. బాన్సువాడ ఉప ఎన్నికల్లో కచ్చితంగా పోచారంను ఓడిస్తామని చెప్పారు. త్వరలోనే ప్రశాంత్ రెడ్డి, ఇతర పార్టీ సీనియర్ నాయకులు సహా తాను బాన్సువాడలో పార్టీ శ్రేణులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీ వీడలేదనీ, బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే కొండంత అండని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు.
గురుకుల సమస్యలపై ప్రభుత్వం స్పందన హర్షణీయం
గురుకుల పాఠశాలల్లోని సమస్యలపై ప్రభుత్వం స్పందించటం హర్షణీయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఎనిమిది నెలల్లో విషాహారం కారణంగా దాదాపు 500 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలోని బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపు 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భోజనానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ పాఠశాలలను సందర్శించటం అభినందనీయమని తెలిపారు. మంత్రులు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల భోజనం సహా ఇతర అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. అంతా బాగానే ఉందన్నట్టు మొద్దు నిద్రలో ఉన్న సర్కార్‌ను మేల్కొనే విధంగా తమ పార్టీ కార్యకర్తలు కృషి చేసినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెయ్యి గురుకులాల్లో విద్యా, భోజనం, వసతులు బాగుండేలా కృషి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు.
మెరిట్ అభ్యర్థులతో గురుకుల పోస్టుల భర్తీ చేయాలి
గురుకుల పోస్టుల్లో భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ గురుకుల అభ్యర్థులు మంగళవారం కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఆయనకు వివరించారు. గురుకుల బోర్డు చేపట్టిన నియామకాల్లో డౌన్ మెరిట్ లిస్టును ఆపరేట్ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. గురుకుల బోర్డు చేపట్టిన నియమాకాలలో 9,024 పోస్టుల్లో డిసేన్డింగ్ ఆర్డర్ పాటించకపోవటం, చాలామంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం మూలంగా సెకండ్ మెరిట్‌లో ఉన్న వారికి నష్టం జరుగుతున్నదని తెలిపారు. ఆ పోస్టులలో భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థుల్లో భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు జీవో 81ను సవాల్ చేస్తూ ఐదు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం తరుపున ఆ జీవోను అడ్డంకిగా చూపిస్తూ న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదని కేటీఆర్‌కు వారు వివరించారు. గతంలో టీఎస్ ట్రాన్స్‌కో, టిఎస్ ఎస్పీడీసీఎల్ , టీఎస్ ఎన్పీడీఎస్ నిర్వహించిన వివిధ నోటిఫికేషన్లలో ప్రస్తుతం గురుకులాల్లో ఏర్పడుతున్నట్టుగానే భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడే ప్రమాదం ఉన్నప్పుడు నిరుద్యోగులు నష్టపోకుండా ఉండటం కోసం జీవో 81 అమలు చేయకుండా వన్ టైం రిలాక్సేషన్ కల్పించారని గుర్తు చేశారు.తద్వారా పోస్టులు మిగిలిపోకుండా డౌన్ మెరిట్ ఆపరేట్ చేసి తదుపరి మెరిట్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేశారని వివరించారు. అదే తరహాలో ఈ గురుకుల పోస్టుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. గురుకులాలతో పాటు డీఎస్సీకి సంబంధించిన అభ్యర్థులనేకమంది న్యాయం కోసం ఎదురుచూస్తున్నారనీ, వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గురుకుల నిరుద్యోగ విద్యార్థులు రత్న శేఖర్ రెడ్డి, స్వాతితో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, విద్యార్థి విభాగం నాయకులకు గెల్లు శ్రీనివాసు, నిరుద్యోగ విద్యార్థులు దామోదర్ రెడ్డి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.