Sunday, August 23, 2026
E-PAPER
Homeఖమ్మంఉద్యమకారులను ‘దిమాగీ నక్సలైట్లు’ అనడం ప్రజాస్వామ్యానికి అవమానం

ఉద్యమకారులను ‘దిమాగీ నక్సలైట్లు’ అనడం ప్రజాస్వామ్యానికి అవమానం

- Advertisement -

– ఈ వ్యాఖ్యలు ప్రధాని మోడీ దిగజారుడు తనానికి నిదర్శనం
– సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోకినేపల్లి
నవతెలంగాణ-సత్తుపల్లి 

ప్రజా హక్కులు, సమస్యల పరిష్కారం కోసం పోరాడే సామాజిక, ప్రజా ఉద్యమకారులను ప్రధాని నరేంద్ర మోడీ ‘దిమాగీ నక్సలైట్లు’గా అభివర్ణించడం ప్రజాస్వామ్య సూత్రాలను అవమానించడమేనని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆ పార్టీ జిల్లా నాయకుడు లాజర్ అధ్యక్షతన జరిగిన కల్లూరు డివిజన్ కమిటీ సమావేశంలో వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రశ్నించే గొంతులను భయపెట్టాలని చూడటం బిజెపి నిరంకుశ పాలనకు అర్థం పడుతోందన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాల పాలనలో ప్రజలపై అణచివేత తీవ్రంగా ఉందన్నారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువకులు జరుపుతున్న పోరాటాలకు ప్రజల మద్దతు ఉందన్నారు.

గత 13 ఏళ్ల బీజేపీ-ఆర్ఎస్ఎస్ పాలనలో దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. ​మరోవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా హామీలను నెరవేర్చడంలో ఘోరంగా  విఫలమైందని పార్టీ జిల్లా కార్యదర్శి వై. పుల్లయ్య విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, పెన్షన్ల మంజూరులో ఆలస్యం జరుగుతోందని, రాష్ట్రంలో గంజాయి రవాణా పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని, పోడు భూములకు పట్టాలు ఇచ్చే ప్రక్రియను వెంటనే చేపట్టాలన్నారు. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూకలకుంట రవి, పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కే శ్రీనివాసరావు, నాయకులు గంటా శ్రీనివాసరావు, అమర్లపూడి శరత్, గోకినేపల్లి లలిత, కే. పుల్లారావు, తాటి రాజు ఒగ్గు నాగిరెడ్డి, మాల్యాద్రి పరిమళ, వెంకట నరసమ్మ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -