పార్లమెంట్‌లో కులం కలకలం

– అనురాగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలతో పెను దుమారం
– భగ్గుమన్న ప్రతిపక్షాలు
– లోక్‌సభలో ఆందోళన…సభ వాయిదా
– ప్రధాని మోడీపై ప్రివిలేజ్‌ నోటీస్‌
– ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకం : ప్రతిపక్షం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌లో ‘కులం’ కలకలం సృష్టించింది. బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ బుధవారం లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి తమది ఏ కులమో కూడా తెలియని వారు కుల గణనను కోరుతున్నారని చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ సభ్యులు ఆందోళన చేపట్టారు. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కులం గురించి చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు హోరెత్తించారు. అనురాగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలను రికార్డ్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అలాగే కేంద్ర మంత్రికి ‘సిగ్గు ఉందా’ అని ప్రశ్నించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభను స్పీకర్‌ ఓం బిర్లా వాయిదా వేశారు.
శివసేన (యూబీటీి) నేత అనిల్‌ దేశారు మాట్లాడుతూ పార్లమెంట్‌లో ముందుకొచ్చిన కులం అంశం రాజ్యాంగబద్ధంగా అభ్యంతరకరమైనదని అన్నారు. అనురాగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలపై నిరసనలు సహజమైనవేనని పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వారు సైతం ఇలాంటి అంశాలు పార్లమెంట్‌లో ఎందుకు ప్రస్తావనకు వస్తున్నాయని విస్మయం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఒకరి మతం, కులం గురించి మరొకరు ప్రశ్నలు లేవనెత్తడం ఆందోళన రేకెత్తిస్తోందని పేర్కొన్నారు.
లోక్‌సభలో బీజేపీ నేతలు కులాల ప్రస్తావన తీసుకురావడంపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే విస్మయం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో కులాల ప్రస్తావన సరైంది కాదని, రాహుల్‌ గాంధీని అవమానించేందుకే అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడారని, ఇది సరి కాదని చెప్పారు. ఎంతోమంది సీనియర్‌ బీజేపీ నేతలు కులాంతర వివాహాలు చేసుకున్నారని, ఈ విషయం వారు గుర్తెరగాలని అన్నారు. ముందు మీరు అద్దంలో చూసుకుని ఇతరుల గురించి మాట్లాడాలని బీజేపీ నేతలకు ఖర్గే హితవు పలికారు. అనురాగ్‌ ఠాకూర్‌ అపరిపక్వతతో మాట్లాడితే దాన్ని ప్రధాని మోడీ ట్వీట్‌ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పలువురు బీజేపీ నేతలు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నారు, వారు ప్రతి ఒక్కరి కులం గురించి అడుగుతారా..? ఇది తప్పని, దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఖర్గే పేర్కొన్నారు. ప్రధాని మోడీ ట్వీట్‌ను కూడా తాను ఖండిస్తున్నానని చెప్పారు. ఎక్కడ మాట్లాడాలి, దేన్ని సమర్ధించాలనేది ప్రధాని మోడీ తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ విషయం పక్కనపెట్టి సెంటిమెంట్లను రగిలించేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో దీన్ని అనుమతించరాదని ఖర్గే స్పష్టం చేశారు. ”సామాజిక, ఆర్థిక కుల గణన అనేది ఈ దేశంలోని 80 శాతం మంది ప్రజల డిమాండ్‌. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు 80 శాతం ప్రజలను అవమానించడమే” అని ప్రియాంక గాంధీ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 80 శాతం మందిని ఇప్పుడు పార్లమెంటులో అవమానిస్తారా? అని ఆమె ప్రశ్నించారు.
కులగణన ప్రాతిపదికన ‘దేశాన్ని విభజించడానికే’ : కిరణ్‌ రిజిజు
కులం గురించి అడగడంలో తప్పు లేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. రాహుల్‌గాంధీ కుల గణన ప్రాతిపదికన ”దేశాన్ని విభజించడానికి” ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని ఆరోపించారు. ప్రజలను విభజించే ప్రయత్నాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌ను బీజేపీ అనుమతించబోదని అన్నారు. ‘కులం’ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరి మాట్లాడుతూ ”నవ భారతదేశం ఒక కొత్త కలను చూసింది. ప్రతిదానిని కులంతో ముడిపెట్టడం సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరు” అని అన్నారు.
ప్రధాని మోడీపై ప్రివిలేజ్‌ నోటీస్‌
లోక్‌సభలో కులాల గొడవ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రసంగానికి ప్రధాని మోడీ మద్దతిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ప్రివిలేజ్‌ మోషన్‌ను ఇచ్చింది. కాంగ్రెస్‌ ఎంపీ చరణ్‌జిత్‌ సింగ్‌ లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు ఈ మేరకు బుధవారం ఫిర్యాదు చేశారు. లోక్‌సభలో అనురాగ్‌ ఠాకూర్‌ ప్రసంగాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘నా యంగ్‌, ఎనర్జిటిక్‌ సహౌద్యోగి అనురాగ్‌ ఠాకూర్‌ చేసిన ఈ ప్రసంగాన్ని తప్పక వినాలి. వాస్తవాలు, హాస్యంతో కలగలిసిన ఇది ‘ఇండియా’ ఫోరం డర్టీ రాజకీయాలను బట్టబయలు చేస్తుంది’ అని అందులో పేర్కొన్నారు. మరోవైపు లోక్‌సభకు సంబంధించిన వివాదాస్పద వీడియో క్లిప్‌ను ప్రధాని మోడీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంపై కాంగ్రెస్‌ మండిపడింది. ఇది అత్యంత దుర్వినియోగం, రాజ్యాంగ విరుద్ధమని విమర్శించింది. ప్రధాని మోడీ పార్లమెంటరీ ప్రత్యేకాధికారాలను తీవ్రంగా ఉల్లంఘించారని ఆరోపించింది. దీంతో మోడీకి వ్యతిరేకంగా ప్రత్యేక అధికార తీర్మానాన్ని తీసుకొచ్చింది. పంజాబ్‌ మాజీ సీఎం, జలంధర్‌ ఎంపీ చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఈ మేరకు ప్రధాని మోడీపై లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు.న

Spread the love