– మోడీ సర్కారుపై ఆప్ ఆరోపణలుకాంగ్రెస్‌తో వెళ్తే కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేస్తుంది
న్యూఢిల్లీ : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ఆప్ ముందుకు సాగితే కేజ్రీవాల్‌ను సీబీఐ ద్వారా అరెస్టు చేయించాలని కేంద్రంలోని మోడీ సర్కారు యోచిస్తున్నదని ఆప్ వర్గాలు ఆరోపించాయి. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని సీబీఐ యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసిందని ఢిల్లీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే అతిషి అన్నారు. ”అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నుంచి ఏడుసార్లు సమన్లు అందినట్టు గత రెండు నుంచి రెండున్నర నెలలుగా మనందరం చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఈడీ ద్వారా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయటం కుదరదని బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి అర్థమైంది. అందుకే ఇప్పుడు కేంద్రం సీబీఐని తీసుకొచ్చి, దాని ద్వారా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నది” అని ఆమె తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారని తమకు సమాచారమందిందని గత రెండు రోజుల్లో ఆప్ నేతలు మీడియాకు చెప్పటం ఇది రెండోసారి కావటం గమనార్హం. ఫిబ్రవరి 22న కూడా అతిషి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.