పి.ఎఫ్., గ్రాట్యుటీల లాగా పెన్షన్ మూడవ బెనిఫిట్‌గా ఇవ్వాలని దేశ కార్మికవర్గం దశాబ్దాలుగా పోరాడుతున్నది. పాలక పార్టీలు ఆ కోర్కెను అంగీకరించకుండా, 1971లో ఫ్యామిలీ పెన్షన్ స్కీంను, దాని స్ధానంలో 1995లో ఎంప్లా యీస్ పెన్షన్ స్కీంను ముందుకు తెచ్చాయి. ఈ.పి.ఎస్‌వల్ల కార్మిక వర్గానికి జరిగే నష్టాన్ని వివరించి, 1996 ఫిబ్రవరి 23న సమ్మెకు సీఐటీయూ ఇచ్చిన పిలుపుపై కార్మికవర్గం విశేషంగా పాల్గొని తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఈ.పి.ఎస్ స్కీంను ప్రతి మూడేండ్లకు సమీక్ష చేసి కార్మికులకు మెరుగైన ప్రయోజనాలు కల్పిస్తామన్న ఆనాటి పాలకుల మాటలను మిగతా సంఘాలు నమ్మాయి. 1995 నుండి 2024 ఈ మధ్య కాలంలో కేవలం రెండుసార్లు (2008 మరియు 2014) మాత్రమే సమీక్ష చేశాయి. ఆ రెండుసార్లు కూడా అప్పటికే అరకొరగా వున్న ప్రయోజనాలను మరింత కుదించి వేశాయిు. మరోవైపున జిపిఎఫ్ స్థానంలో ఎన్.పి.ఎస్‌ను ముందుకు తెచ్చి 2004 నుండి అమలు చేస్తున్నాయి. ఎన్‌పిఎస్‌ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా ఉద్యోగులు/ కార్మికులు, సంఘాలతో కలిసి ఆందోళనలు చేశాయి, చేస్తూనేవున్నాయి. చివరకు అనేక రాష్ట్రాలలో అది ఒక రాజకీయ డిమాండుగా ముందుకు రావడంతో ఉద్యోగు లకు పాలక పార్టీలు హామీ ఇవ్వాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ.పి.ఎస్‌ను అమలు చేయడానికి వెనకడుగు వేస్తు న్నాయి. ఎందుకంటే పాలక పార్టీల పేర్లు ఏమైనా (లెఫ్ట్ మినహా) పెన్షన్‌ను భారంగాను, ఈ భారం రాబోయే కాలంలో మరింత పెరుగు తుందని, దానిని ఎలా తగ్గించుకోవాలనే దానిపైనే దృష్టి పెడుతున్నాయి. అందులో భాగంగానే యూనిఫైడ్ పెన్షన్ స్కీంను ముందుకు తెచ్చాయి. ప్రపంచ అనుభవం చూసినా పాలకులు పెన్షన్ సంస్కరణలు ముందుకు తెస్తుంటే, వాటిని ప్రతిఘటిస్తూ కార్మిక వర్గం సమ్మెలతో సహా అనేక రూపాలలో ఆందోళనలు చేస్తున్నాయి.
హయ్యర్ పెన్షన్‌పై
ఇక, హయ్యర్ పెన్షన్ విషయానికి పరిశీలిస్తే, 2014 కేంద్ర ప్రభుత్వం పెన్షన్ స్కీం- 1995కి 2014లో చేసిన సవరణలను వ్యతి రేకిస్తూ రాష్ట్రాలలో అనేక ఆందోళనలు నిర్వహించడంతో పాటు, రాష్ట్ర హైకోర్టులలో కేసులు వేశారు. 2014 సవరణలను కొట్టివేస్తూ కేరళ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. అదే తరహా లో అనేక హైకోర్టులు తీర్పులి చ్చాయి. ఈ తీర్పు లనన్నింటిని సవాల్ చేస్తూ, సుప్రీంకోర్టులో కేసు వేసిన నేపధ్యంలో ఆ కేసులనన్నింటినీ కలిపి విచారించిన అపెక్స్‌కోర్టు నవంబర్ 4, 2022న తుది తీర్పును వెల్లడించింది. 2014లో ఈ.పి.ఎస్ పధకానికి చేసిన సవరణలు ‘చట్టబద్ధమైనవి మరియు చెల్లుబాటు అయ్యేవి’ అని ఆ తీర్పులో చెబుతూనే, చట్టంలో హయ్యర్ పెన్షన్‌కు సంబంధించిన పేరా 11(3)ని రద్దు చేసిన సమయంలో, హయ్యర్ పెన్షన్ కోసం జాయింటు డిక్లరేషన్ (పేరా 26.6 ప్రకారం) సమర్పించడానికి ఇచ్చిన ఆరునెలల సమయంపై కార్మికులకు సరైన సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. గనుక హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ ఇవ్వడం కోసం మరో నాలుగు నెలల గడువు ఇస్తున్నామని,హయ్యర్ పెన్షన్ స్కీం నిర్వహణ కోసం కార్మికుల నుండి 1.16శాతం డబ్బులు వసూలు చేయడం సరైంది కాదని చెప్పింది. దీనికి ప్రత్యామ్నాయం చూడా లని, ఆరు నెలల గడువులోపు ప్రభుత్వం ఆపని చేయకపోతే కార్మికుల నుండి ఎట్టి పరిస్థితులలో వసూలు చేయవద్దని తీర్పునిస్తామని కోర్టు తన తీర్పులో తెలిపింది. 1.16శాతం నిర్వహణ ఖర్చును యజమాని వాటా నుండి రికవరీ చేస్తూ కార్మికులను మోసం చేసింది.
కార్మికులకు పరిమితమైన ప్రయోజనాలు కల్పించేదే అయినా, ఈ తీర్పును అమలు చేయడం కూడా కేంద్రానికి ఇష్టం లేదు. కోర్టు ఇచ్చిన నాలుగు నెలల గడువు మరో తొమ్మిది రోజులలో ముగుస్తుందనగా, తీర్పు అమలుకు మొదట సర్క్యులర్‌ను ఇచ్చి తన వైఖరి ఏమిటో చెప్పకనే చెప్పింది. ఆ సర్క్యులర్ అస్పష్టంగా వుందని, జాయింటు డిక్లరేషన్స్ ఇవ్వడంలో వున్న ఆటంకాలు తొలగించాలని, ఆప్షన్స్ ఇచ్చు కోవడానికి సరైన సమయం ఇవ్వాలని, తదితర అనేక అంశాలపై స్పష్టత ఇవ్వాలని సీఐటీయూ అఖిల భారత కేంద్రం సిపిఎఫ్‌సికి విజ్ఞప్తి చేసింది. ఆ కృషి ఫలితంగానే అనేక ఆటంకాలను అధిగమించి, ఈ రోజు పద్దెనిమిది లక్షల మంది హయ్యర్ పెన్షన్‌కు ఆప్షన్ ఇచ్చుకోగలిగారనేది అక్షర సత్యం.
పెన్షన్ లెక్కింపులో కోత
ఇక్కడ నుండి బీజేపీ ప్రభుత్వ కుట్ర మొదలైంది. కోర్టు తీర్పును అమలు చేస్తున్నట్లే వుండాలి, దానితో పాటు తమ ప్రభుత్వంపై భారం తగ్గించుకోవడమే కాక, ప్రభుత్వానికి అదనపు నిధులు పోగేసుకోవడానికి మార్గాలను అన్వేషించింది. అందులో నుండి ముందుకు తెచ్చింది ‘దామాషా పద్ధతి’. సాధారణ పెన్షన్‌ల చెల్లింపులో దామాషా పద్ధతిన లెక్కించడం సరైనదే. కానీ ఎప్పుడయితే కార్మికుడు హయ్యర్ పెన్షన్‌కు ఆప్షన్ ఇస్తాడో, 1995 స్కీం ప్రారంభమైన నాటి నుండి నేటివరకు సీలింగ్‌పైన కాకుండా పూర్తి జీతంపైన 8.33 శాతం నిధులను పెన్షన్ ఫండ్‌కు జమచేయడంతో పాటు 1.16శాతం నిధులు స్కీం నిర్వహణ ఖర్చులు కూడా చెల్లిస్తారు. అంటే యజ మాని చెల్లించే 12శాతం నిధులలో 9.49శాతం పెన్షన్ ఫండ్‌కు బదిలీ అవుతాయి.
ఈ.పీ.ఎస్ సభ్యుడు అయిన రోజు నుండి పూర్తి జీతంపైన పెన్షన్ ఫండ్‌కు నిధులు చెల్లించిన తర్వాత దామాషా పద్ధతి వర్తిం చదు. కేవలం 1971-95 మధ్య ఈ.పి.ఎస్ స్కీం లాభం, 1995 నుండి తాను స్కీం నుండి ఎగ్జిట్ అయ్యే వరకు వున్న కాలానికి చట్ట ప్రకారం చివరి అరవై నెలల జీతం సగటును తీసుకుని పెన్షన్ లెక్కించాలి. కానీ చట్టాన్ని లెక్క చేయకుండా తాను విడుదల చేసిన సర్క్యులర్స్‌ను కూడా కాదని హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చిన వారికి దామాషా పద్ధతిని (Aందీంజ) అమలు చేస్తూ, చట్ట ప్రకారం తనకు ఇవ్వాల్సిన పెన్షన్‌ను దాదాపు 40శాతం కోతపెడుతున్నది. ఈ దుర్మార్గమైన దామాషా పద్ధతిని తిప్పికొట్టి చట్టపరంగా మనకు రావలసిన పెన్షన్ కోసం పోరాడటం తక్షణ కర్తవ్యం.
అలాగే పెన్షనబుల్ సర్వీసు కాలాన్ని లెక్కించే దానిలో కూడా మోసం చేస్తున్నారు. చట్టంలోని పేరు 10(2)కు 2009లో సవరణ చేస్తూ జి.ఎస్.ఆర్ నెం. 546(ఇ)ని విడుదల చేస్తూ (24 జులై.2009 నుండి అమలు), సభ్యుడు 58 సం||ల సర్వీసు పూర్తి చేసుకొని స్కీం నుండి వైదొలిగేటప్పుడు, 20 సం|| పెన్షనబుల్ సర్వీసు పూర్తి చేసుకొన్నట్లయితే అతనికి రెండేండ్ల సర్వీసును వెయిటేజ్ కింద కలిపి పెన్షనబుల్ సర్వీసును నిర్ధారిస్తారు. స్కీం ప్రారంభించిన 1995 సభ్యుడు అయిన కార్మికుడు, 2015 నవంబర్ తర్వాత ఇరవైయేండ్ల వెయిటేజ్ వస్తుంది. కానీ పెన్షన్‌ను కుదించడానికి రెండేండ్ల వెయిటేజ్‌ని 2014కంటే ముందే కలిపి పెన్షనబుల్ సర్వీస్‌ను లెక్కించి మోసం చేస్తున్నారు.
పెన్షనబుల్ జీతం విషయంలో కూడా ఇటువంటి మోసమే జరుగుతున్నది. జీతం అంటే బేసిక్ పే+ కరువు భత్యం+ డి.ఎ. అరియర్స్/ ఫుడ్ కూపన్‌లతో పాటు రిటైనింగ్ అలవెన్స్ కూడా అని ఈ.పి.ఎఫ్ అండ్ ఈ.పి.ఎస్ చట్టం చెబుతున్నది. కోర్టు తీర్పును అనుసరించి, సభ్యుడు కట్టాల్సిన బకాయిలను 1995 నుండి ఇప్పటివరకు అదే లెక్కన లెక్కించి, డిమాండ్ నోటీసులు జారీ చేసి కార్మి కుల వద్ద నుండి జమ చేయించింది. కానీ చివరగా అతని పెన్షనబుల్ జీతంను లెక్కించేటప్పుడు అతని డి.ఎ అరియర్స్‌ను పరిగణనలోకి తీసుకోకుండా వున్నందున వారికి రావలసిన హయ్యర్ పెన్షన్ కుదించబడుతున్నది.
ఆర్టీసీలో సమస్య-సీఐటీయూ కృషి
ఏపీ, టీజీ ఆర్టీసీలలోని కార్మికులకు వస్తున్న సమస్యలను ఆర్టీసీ యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సీఐటీయూ అఖిల భారత కేంద్రం లోతుగా పరిశీలించిన మీదట 2024 ఆగస్టు 5న ఒక వినతిపత్రం, ఆగస్టు పద్నాలుగున మరో వినతిపత్రం సిపిఎఫ్‌సికి ఇచ్చి, ఒత్తిడి తీసుకొచ్చింది. కెవైసి సమస్యల పరిష్కారానికి ఒక ఎస్‌ఓపి (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్), పెన్షన్ నిధులు జమ కాకుండా బ్యాన్ చేసిన అకౌంట్లను (టీజీఆర్టీసీలో 1400) రీఓపెన్ చేయడానికి ఒక ఎస్‌ఓపిని కేంద్ర ఈపీఎఫ్‌ఓ విడుదల చేసింది. గుర్తించిన పదకొండు సమస్యలను కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌కు పంపడంతో పాటు, తెలంగాణ బోర్డు మీటింగ్‌లో ఎజెండాగా పెట్టి చర్చించాలని కోరుతూ ఆర్‌పిఎఫ్‌సి-బర్కత్‌పుర వారికి వినతిపత్రం ఇవ్వడమేకాక, కమిటీ సభ్యులుగా వున్న కార్మిక సంఘాల ప్రతినిధులకు పంపింది. సిఐటియు నాయకత్వం లేఖ రాసింది. మిగతా సంఘాలు కూడా రాసి ఒత్తిడి తెస్తే సమస్య పరిష్కారానికి అవకాశముంటుంది.
– వి.ఎస్. రావు, 9490098890