- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ఆందోళనకు పిలుపునిచ్చింది. బుధవారం సమాచార పౌరసంబంధాల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎదుట శాంతియుత నిరసనకు భారీగా జర్నలిస్టులందరూ తరలి రావాలని ఆ సంఘం రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇండ్లస్థలాలు, హెల్త్ కార్డులను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, అందులో తీవ్ర జాప్యం జరుగుతున్నదన్నారు. ఒకే యూనియన్ కు చెందిన వాళ్లను అక్రిడిటేషన్ కమిటీల్లో నియమించడంతో నియంతృత్వం రాజ్యమేలుతోందన్నారు. ఏకపక్షంగా కార్డులు జారీచేస్తున్నారని ఆరోపించారు. గత 40 ఏండ్లుగా జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదని, వెంటనే ఆ ప్రక్రియ చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులను ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే బహిరంగ నిరసన కార్యక్రమానికి టీడబ్ల్యూజేఎఫ్ పిలుపు నిచ్చిందన్నారు. అలాగే ఆర్టీసీ, మెట్రోలలో ప్రయాణాన్ని ఇక నుంచి పూర్తిస్థాయిలో ఉచితంగా ఇవ్వాలని, రైల్వే పాసులను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్కార్ పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి త్వరలో ఢిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టానున్నామని తెలియజేశారు. సమాచార్ భవన్ దగ్గర జరిగే బహిరంగ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫెడరేషన్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.



