– ఈ విద్యాసంవత్సరం అమలు చేయొద్దు
– గ్రేడింగ్ స్థానంలో మార్కులతో అసమానతలు పెరిగే ప్రమాదం
– ప్రభుత్వ నిర్ణయాన్ని వాయిదా వేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మార్పులను ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమలు చేయొద్దని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వార్షిక పరీక్షలకు 90 రోజుల ముందు నిర్ణయించడం వల్ల విద్యార్థులు తీవ్ర గందరగోళం చెందే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షల పద్ధతిలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తే విద్యార్థులు ఆ రూపంలోనే సన్నద్ధం కావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులను పరీక్షల ముందు ఇలాంటి గందరగోళం సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కులను తీసుకుని వచ్చి జీపీఏను రద్దు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఈ మార్పుల వల్ల గ్రేడింగ్ స్థానంలో మార్కులను తీసుకురావడం వల్ల విద్యార్థుల్లో అసమానతలు పెరిగే అవకాశముంటుందని పేర్కొన్నారు. మార్కుల వేటలో విద్యార్థులు పోటీపడి మార్కులు, ర్యాంకుల కోసం ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థల చుట్టూ విద్యార్థులు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం విద్యా సంస్థలు కూడా ఈ మార్కుల వేటలో నష్టపోయే అవకాశముంటుందని వివరించారు. విద్యార్థులను గందరగోళపరిచే నిర్ణయాలు కాకుండా ఎఫ్‌ఏ-1, ఎఫ్‌ఏ-2, ఎస్‌ఏ-1 పరీక్షలు రాశారని తెలిపారు. వార్షిక పరీక్షలను వేరే పద్ధతిలో రాస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పుడున్న విధానంలోనే పరీక్షలను నిర్వహించాలని సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పరీక్షల విధానంలో మార్పులను అమలు చేయాలని కోరారు.