”ప్రక్రియ ఏదైనా అక్షరం అంతస్సారం మానవ మహేతిహాసాన్ని గానం చేయడమే”
అంటాడు శిఖామణి. నిజమే పద్యమైనా, పాటైనా మరేదయినా అంతిమంగా ప్రజా
చైతన్యానికి ప్రేరణగా నిలవాలి. సామాజిక సంవేదనలను చిత్రించకపోతే ఆ కవిత్వానికి
మనుగడలేదు. కొంతమంది పద్యకవులు భాషా వ్యామోహంతో, సజనాహంకారాన్ని
ప్రదర్శించి, కాకులు దూరని కారడవిలాంటి, చీమలుదూరని చిట్టడవి లాంటి కవిత్వం రాసి,
సగటు పాఠకులను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రజల బాధలను విస్మరించి, పరమాత్మ
గాథలను వర్ణనోద్రేకంతో గానం చేశారు. సామాజిక స్పహలేని శతకాలు, పద్యకావ్యాలు
రాసి, రసహీనమైన చమత్కారాలతో కవితాతత్త్యాన్ని వెగటుపుట్టించారు. అందుకే ఒళ్ళు
మండిన వచనకవులు దుడ్డుకర్రలతో పద్యకవులను పరిగెత్తించారు. పద్యాలనడుములు
విరగదంతామని సవాల్ చేశారు . ఈ ఛందో బంధోబస్తుల వ్యవహారంలో నేరస్థులు
పండితులే కానీ, పద్యం కాదని వేమన ఆటవెలది ఆనాడే తీర్పుచెప్పింది.
ఆటవెలదితో వేమన తెలుగుసాహిత్యానికి కొత్తబాట వేశాడు. మానవీయ విలువలను, ప్రజాస్వామ్య భావజాలాన్ని దశదిశలా ప్రచారం చేశాడు. సాహిత్యంలో వైజ్ఞానిక దష్టికి వేమనఅంకురార్పణ చేశాడు. పాటకు ఉన్న శక్తి ఆటవెలది పద్యానికి కూడా ఉందని ఆ ప్రజాకవి రుజువుచేశాడు. అందుకే ఎంతోమంది శతకకవులు వేమన ఆటవెలది బాటలో మునుముందుకు సాగిపోయారు.
ఈ మధ్యకాలంలో చాలామంది పాఠశాల, కళాశాలల విద్యార్థులు కూడా శతక ప్రక్రియ వైపు కలం సారిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణప్రాంతంలో అతి చిన్నవయస్సులోనే విద్యార్థులు మంచిశతకాలు వెలువరిస్తున్నారు. శతవసంతాల ఘనచరిత్ర కలిగిన హైదరాబాద్ ప్రభుత్వ సిటీకళాశాల విద్యార్థులు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో కవిత్వం రాస్తూ మిగతావారికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. కళాశాల తెలుగుశాఖ గురువుల ప్రోత్సాహంతో శ్రీనిధి, చిన్నపట్ల హరిప్రియ, ఋషి, వంటి విద్యార్థులు ఇప్పటికే కవితా సంపుటాలను ప్రచురించి కవులుగా ఎదిగారు. ఇప్పుడు మరో విద్యార్థి చిక్కొండ్ర రవి వచన కవిత్వంలోనూ, పద్యరచనలోనూ ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగిపోతున్నాడు.
చిక్కొండ్రరవిప్రస్తుతం సిటీ కళాశాలలో డిగ్రీ తతీయ సంవత్సరం చదువుతున్నాడు. రవి బాల్యాన్ని, కుటుంబ నేపథ్యాన్ని గమనిస్తే గోరటి వెంకన్న రాసిన ‘మందెంట బోతుండే ఎలమంద’ అనే పాట యాదికి వస్తుంది. ‘చూస్తే చిన్న పొరగాడు ఎలమంద వన్నెరుమాలు కట్టిండు ఎలమంద’ అని అన్నట్లుగా రవి చిన్న వయస్సులోనే మిన్న కవితాసుమాలు పూయిస్తున్నాడు. పని పాటలే ఉఛ్వాస నిశ్వాసలుగా బతికే కుటుంబం నుంచి, గొర్రెలమందను అనుసరిస్తూ చెట్టూ, పుట్టా, చేను, చెలక తిరుగుతూ ప్రతినిత్యం ప్రకతి ఒడిలో సేదతీరే వత్తి నుండి, రంగనాథ రామాయణకర్త గోన బుద్ధారెడ్డి నడయాడిన మట్టి వారసత్వం నుండి, తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబికకవిత ప్రతిధ్వనించిన ప్రాంతంనుండి వచ్చినరవికవిత్వం రాయకుండా ఎలావుంటాడు. అసలు గొర్రెలకాపరికిమించినగొప్పతత్త్యవేత్త విశ్వంలో ఎవరున్నారు? సంచారమే సమ్యక్ జ్ఞానాన్ని సమకూరుస్తుంది. మందను కాపలా కాస్తూ అలవోకగా పద్యాన్ని అల్లుకున్నాడు రవి.ఆటవెలదిని ఒక ఆయుధంగా చేసుకొని ప్రతీఘాత శక్తులపై రవి అక్షరయుద్ధం చేస్తున్నాడు. ”ఇది మా వేమన నడిచిన తొవ్వ. సదువుకు దూరం చేయబడ్డ వాళ్ళు, సామాన్యులు సైతం అర్థం చేసుకొని విజ్ఞాన సోయితో వెలుగులోకి సాగిపోయే శ్రమల సక్కని బాట” (వీరనాగు సుతుని విడుపు మాట) అని రవి అన్నట్లుగా విజ్ఞానసోయితో సాగే శతకంతో పాఠకుల ముందుకొస్తున్నాడు రవి. రవి తల్లిదండ్రులు కష్టజీవులు. ఆ కష్టం విలువఅతనికి తెలుసు. ‘పొద్దు కన్న ముందు సద్ది నెత్తినబెట్టి/ పొలము గట్లమీద పొద్దులయ్యె/ బడుగుపడతి కంటె బాహుబలెవరింక” అని రవి హేతుబద్ధంగా ప్రశ్నిస్తున్నాడు. అసమాన శ్రమైకధీరులు, కార్య శూరులు లోకైక వీరులు, బహుజన స్త్రీలేనని చాటిచెబుతున్నాడు. ఈ మాటను కాదనే ధైర్యం ఎవరికి ఉంది? ”చచ్చి పడిన పశువుచర్మంబునువొలిచి/ చెప్పులెన్నొ కుట్టిచేయు మేలు/ ఆది సేవకెపుడు అర్థంబు మాదిగ” అంటూ మాదిగల వత్తిగతమైన నైపుణ్యాన్ని కొనియాడాడు. ‘వెలుగుపుట్టినిల్లు వెలివాడయేనని’, మాల, మాదిగలుతనకు తల్లిదండ్రులవంటి వారని, దళిత, బహుజనుల ఐక్యతను శతకంలోరవి ఉదాత్తంగాఉద్బోధించాడు. ‘కష్టజీవులంత కలిసి పోరునుజేస్తె/ దోచుకొనెడి వారి గోచి లూడిపోతాయని’ వారికి కర్తవ్యాన్ని నూరిశాడు కవి ”పరులకడుపు నింపు ప్రథమ వేల్పు రైతు” అంటూ అన్నం పెట్టె రైతే ఆది దేవుడని వాదిస్తున్నాడు. ఈ విధంగా కవి శ్రమతత్త్వానికి రవి పద్య నీరాజనాలు పలికాడు. ఆర్ధిక, సామాజిక అసమానతలపై ధర్మాగ్రహాన్ని ప్రకటించాడు.
”జానపదులనోట జాలువారిన భాష/ మేకపాలతీపి మేలి యాస/ తేటతెనుగు మాది తెలగాణ పలుకురా” అంటూ రవి జానపదుల కేంద్రంగా మాతభాష గరిమను తెలియజెప్పాడు. అమతం, చక్కెర, తేనె, పాల మీగడలుఇత్యాది పాతఉపమానలజోలికి పోకుండా, తనవత్తి గతమైన వాతావరణం నుండి తాజా కవితా పరికరాలను సమకూర్చుకొన్నాడు. సాధారణంగా కవుల్లో ‘ప్రౌఢనిర్భర వయః పరిపాకం’లో కనిపించే తాత్త్వికస్ఫూర్తి నూనూగు మీసాల నూత్నయవ్వనం’లోనే రవి కవిత్వంలో చోటు చేసుకోవడం విశేషంగా భావించవచ్చు. అందుకే రవి శతకం ద్వారా ఈతరానికి తక్షణ అవసరమైన గుణపాఠం నేర్పుతున్నాడు. ఋజు మార్గాన్ని, జీవనగమనాన్ని నిర్దేశిస్తున్నాడు. ‘భక్తికాదు జనవిముక్తి పథములోన’ సాగిపొమ్మని కవిజనావళిక ిజాగ్రత్త చెబుతున్నాడు. దీనికి కారణం అతని అధ్యయనం. సిటీకళాశాల గ్రంథాలయం పెట్టే జ్ఞానాన్నంతో నిరంతరం మనసు నింపుకున్నాడు. ప్రజాస్వామ్యవాదుల,మేధావుల ప్రసంగాలను, వ్యాసాలను రవి ఇష్టంగా పరిశీలిస్తాడు. ‘చదువుకన్న ముందు జగతిని చదవాలన్న’ స్పహను పెంచుకుంటున్నాడు. అందుకే బుద్ధుడు, పూలే దంపతులు, అంబేద్కర్, పెరియార్ లాంటి మహనీయులను, జాతికి ప్రాణచైతన్యాన్ని అందించే వారి ఆలోచనలను అనుసరిస్తున్నాడు. బహుజన వైతాళికుల ఆశయాల బాటలో ఆటవెలదికి గజ్జకట్టి ఆడిస్తున్నాడు రవి. తద్వారా రవి దళిత, బహుజన తాత్త్వికతను ఈ శతకం ద్వారా చాటిచెప్పాడు.”త్యాగ ధనుల తోవ”ను తన పద్యాల ద్వారా పాఠకులకు చూపిస్తున్నాడు కవి.
”మమతకడలి వోలె మానవలోకాన/ సమతమూర్తి లాగ సాగినట్టి/ బుద్ధపథము లోనబుద్ధిగా నడవాలి”అంటూ ఆర్థిక తీవ్రవాదంతో, సాంఘీక ఉగ్రవాదంతో, యుద్ధోన్మాదంతో రగులుతున్న ఈనాటి ప్రపంచానికి బౌద్ధమే శరణ్యమని రవి సహేతుకంగా ప్రబోధిస్తున్నాడు ”పేడనీళ్ళు చల్లి పెడబొబ్బలేసిన/ చీడ పురుగులెల్ల చిదిమి వేసి/ చదువు నేర్పి గెలిచెసావిత్రిబాయిరా ”భారతదేశ తొలిమహిళా ఉపాధ్యాయురాలిని భక్తితో స్మరించాడు.
ఈనాటి పాలక వర్గాలు ప్రవచిస్తున్నట్లుగా మతగ్రంథాలు బోధించిన సన్మార్గం కాకుండా భారతరాజ్యాంగ పథమే సకలజనులకు సన్మార్గమని కవి శాసిస్తున్నాడు. మానవీయ విలువలను, వీరనాగు శతకంలో కవి సరళసుందరంగా ఆవిష్కరించాడు కవి. అక్కడక్కడా స్వల్పంగా మందగించినప్పటికీ పద్యం నడక వేగంగా సాగుతుంది. పాఠకులను అలరింపజేస్తుంది. ఆలోచింప జేస్తుంది. గోరటి వెంకన్న అన్నట్లుగా రవి ‘పద్యం కలిమిపండ్ల వగరు, మేకపాల జిగురు, చింతపూల ఇగురు. (బ్లర్బ్) మహబూబ్ నగర్, వనపర్తి ప్రాంతాల్లో వీరనాగమ్మను శూద్రులు అమ్మతల్లిగా తలుస్తారు. రవి అమ్మ పేరు కూడా నాగమ్మ. అందుకే ‘సారమెరిగి సాగు వీర నాగు ‘అనే ఈ శతకమకుటం కూడా బహుళార్థ స్పోరకంగా, ఔచితీమంతంగా ఉంది. రవి, నిత్య కవితాసాధనతో గొప్ప కవిగా రాణించాలని ఆశిద్దాం. వీరనాగుశతకంతో సమకాలీన సాహిత్యంలోకిఅడుగుపెడుతున్న రవికి మేలురాక.
(ఈ నెల 19న వనపర్తి జిల్లా బుద్దారంలో ఆవిష్కరణ సభ)
– డాక్టర్. కోయి కోటేశ్వరరావు 944048027