కన్నుల పండువగా బాలల స్వయం పాలన దినోత్సవం

– ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు
– ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు
– విద్యార్థుల అవగాహన స్థాయి పెరుగుతుంది 
– హెచ్.ఎం జోగా రాంబాబు 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : మండలంలోని మైలారం గ్రామం ప్రాథమిక పాఠశాలలో హెచ్.ఎం. జోగా రాంబాబు పర్యవేక్షణలో విద్యార్థులు గురువారం చాలా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని స్వయం పాలన కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. దీనిలో భాగంగా పలువురు విద్యార్థినీ విద్యార్థులు సాంప్రదాయ ఉపాధ్యాయ వేషధారణలో పాఠశాలకు వచ్చారు. వివిధ తరగతి గదుల్లో వారు మిగతా విద్యార్థుల హాజరు తీసుకుని, పాఠాలు బోధించారు. అనంతరం చెప్పిన పాఠానికి సంబంధించి తోటి విద్యార్థుల అనుమానాలను వారు నివృత్తి ఇచ్చారు. అనంతరం వ్యాయామ తరగతులు నిర్వహించడంతో పాటు పాఠశాల రోజువారి కార్యకలాపాలను సమర్థవంతంగా విద్యార్థులు నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా వేడుకలు పాఠశాల వాతావరణాన్ని కోలాహలంగా మార్చాయి. విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యా బోధనతో పాటు ఉపాధ్యాయ వృత్తి పట్ల విద్యార్థుల ఆసక్తి, బోధనా విధానం పలువురిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. స్వయం పాలనలో విద్యార్థులు పాల్గొనడంతో చిన్నారుల అవగాహన సామర్థ్యం ఎంతో మెరుగుపడుతుందని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ జోగా రాంబాబు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.కుమార్ రాజా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Spread the love