నవతెలంగాణ-ఆర్మూర్
మండలంలోని చేపూర్ గ్రామంలో జూదం,పేకాట స్థావరాలపై ఆదివారం చితా ఫోర్స్ సిసిఎస్ ఏసీపి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నిఘా తీవ్రం చేసిన పోలీసులు, మండలంలోని ఒక పెద్ద పేకాట స్థావరాన్ని బట్టబయలు చేశారు.
గ్రామ శివార్లలో గల సాయన్న ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున పేకాట సాగుతున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. దీంతో చీతా టీం సభ్యులు అత్యంత వ్యూహాత్మకంగా, అకస్మాత్తుగా (మెరుపు దాడి) సాయన్న ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన జూదరులను సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు.
ఈ మెరుపు దాడిలో పోలీసులు ముగ్గురు (3) పేకాట రాయుళ్లను సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.18,300 నగదు స్వాధీనం చేసుకున్నారు.వారి వద్ద 2 కార్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన ముగ్గురు నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు, కార్లు, సెల్ ఫోన్లను చీతా ఫోర్స్ సిబ్బంది తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్ )కి అప్పగించి, నిందితులపై కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఫామ్ హౌస్‌లు, తోటలు లేదా రహస్య ప్రదేశాలలో ఎలాంటి జూదం, పేకాట క్లబ్బులు నిర్వహించినా, చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు (పీడీ యాక్ట్ వరకు) ఉంటాయని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.



