సాయుధ పోరుదృశ్యాల ‘చిత్ర’ ప్రసాద్‌

Prasad's 'picture' of armed combat scenariosకళ అంతిమ లక్ష్యం మానవీయత. అందుకే ‘కళాకారుడు మానవ హృదయ నిర్మాత కావాలి’ అన్నారు. ఆ నిర్మాణంలో తమ శ్రమను, నైపుణ్యాన్ని ధారపోసిన ప్రజాకళాకారులలో చిత్రకారుడిగా ప్రసిద్ధి చెందిన చిత్తప్రసాద్‌ భట్టాచార్య ఒకరు. మార్క్సిస్టు భావజాలంతో కుంచె నాడించిన ప్రజాకళాకారుడీయన. అందులోనూ మన తెలంగాణకు, తన చిత్రాలతో చిరస్మరణీయ బంధాన్ని కలిగి వున్నవాడు. ఆ బంధం 1946 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా ఏర్పడింది. అందుకనే ఈ వారోత్సవాల సందర్భంగా పోరాట ఘట్టాల్ని తన చిత్రాల ద్వారా ప్రపంచానికి ఎరుక పరచిన ఆయన కృషిని గురించి తెలుసుకోవడం స్మరించుకోవడం అవసరంగా భావిస్తున్నాను.
సాయుధ పోరాటాన్ని, దాని చరిత్రను, వారి రాజకీయ అవసరాల కోసం వక్రీకరించి వాడుకోజూస్తున్న వారికి చిత్త ప్రసాద్‌ గీసిన చిత్రాలు సత్యాలను, ఎర్రజెండా త్యాగాలను కళ్ళముందుంచుతాయి. వారి అసత్య ప్రచారాన్ని తిప్పికొడతాయి. ఎక్కడ బెంగాలు! ఎక్కడ తెలంగాణ! బెంగాలు 24 ఉత్తర పరిగణాలలో వున్న నైహతిలో జన్మించిన చిత్తప్రసాద్‌, తెలంగాణ సాయుధ పోరాటం, నాటి ప్రజల తిరుగుబాటును, నిర్బంధాలను, దోపిడీని కళ్లకు కట్టించే దృశ్యాలను చిత్రాలుగా అందించారు. అవి నేటికీ చైతన్యయుతంగా మనతో మాట్లాడుతూనే వుంటాయి. ఆయన చివరి వరకూ కాన్వాసుపై రంగులు వుపయోగించలేదు. బొమ్మలు నలుపూ తెలుపులోనే గీయడానికి బహుశా పేదల, శ్రామికుల బతుకు ఇంకా రంగుల కళగా మారలేదనే సంకేతంగా చూపాడని భావిస్తాను. మట్టి మనుషుల రంగును ప్రతిఫలించడమూ చూస్తాం.
చిత్తప్రసాద్‌ గీసిన రైతుకూలీల, శ్రామికుల బొమ్మలన్నీ కూడా శ్రమైక జీవన సౌందర్యాన్ని చిత్రించిన వాస్తవిక మనుషుల ఉనికిని ప్రతిబింబించేవే. రైతు కూలీ చిత్రాన్ని పరిశీలించండి. వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే స్త్రీ పురుషులిద్దర్నీ వేశారు. వారి ముఖంలో కేవలం శ్రమ చేసే రెండు చేతులు తప్ప మరేమీ లేవని తెలిపే అమాయకమైన స్వచ్ఛత వారి కళ్లల్లో కనిపిస్తుంది. ఇంకో ప్రసిద్ధ చిత్రం – అశేష ప్రజానీకానికి ప్రతీకగా ఓ బలమైన నాయకుడు నిర్బంధించబడి బోర్లా పడుకుని వుంటే అతని వెన్నుపై యుద్ధ విమానాల భారాలు మోపి, ఆధునిక సాంకేతిక, హార్మ్యాలు, ఫిరంగులు, తలపై ఆధిపత్యం వహిస్తున్న అధికారం, కాపలా చిత్రాన్ని చూస్తే ‘బలవంతులు దుర్భలజాతిని బానిసలను గావించారు. నరహంతకులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి… ఏ యుద్ధం ఎందుకు జరిగెనో? ఏ రాజ్యం ఎన్నాళ్లుందో?’ అన్న శ్రీశ్రీ గేయం మననంలోకి రాకమానదు. అంటే దోపిడీదారుల దుర్మార్గాలను, వాటి వెనుక కుట్రలను, శ్రామిక జనుల శ్రమను వంద పుటల్లో చెప్పే చరిత్రను ఒక చిత్రంలో పరిష్కరించాడు చిత్తప్రసాద్‌.
నైజాం ఎన్ని నిర్బంధాలు పెట్టినా, సంకెళ్లు బిగించినా అధిక సంఖ్యాకులైన ప్రజ సాయుధులవుతున్న తీరును అద్భుతంగా ధిక్కార రేఖలతో దృశ్య కావ్యం చేశారు. ‘సమ్మెకట్టిన కూలీల, బిడ్డల ఆకలి కేకలు… సంఘటితమయ్యే ప్రజల సన్నాహాలను దృశ్యమానం చేస్తాయి ఈ చిత్రాలు. భూస్వాముల, జమీందార్ల దురాగతాలు, దౌర్జన్యం, హింస, బీభత్సం, అరాచకాలకూ చిత్రిక పట్టాడు. దోపిడీ, పీడన భరించలేక సామాన్యులు తిరగబడిన దృశ్యాన్ని చైతన్యపూరితమైన రేఖలతో మనముందుంచాడు ఈ ప్రజాకళాకారుడు. ఉద్యమ ప్రేరణ కళారూపాల్లో, పాటల్లో, కథల్లో పొందుతాం సాధారణంగా. కానీ గీసిన చిత్రాల్లో ఉద్యమ చైతన్యం నింపడం చిత్తప్రసాద్‌కే సాధ్యమైంది. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజల సాంస్కృతిక సారాన్ని పట్టుకున్న కళాకారుడుగా, మన ప్రాంతం వాడే అన్నంత మమేకం చెందాడు. అందుకు మార్క్సిస్టుగా జీవితాంతం నిబద్దంగా కొనసాటమే కారణమని చెప్పవచ్చు.
ఒక్క తెలంగాణ సాయుధ పోరాటమే కాదు, ప్రపంచంలో ప్రజాకంటకంగా మారిన ఫాసిస్టు యుద్ధంపైన కూడా తన కలాన్ని ఝళిపించాడు. ముప్పయి లక్షల మంది సామాన్య ప్రజలను బలిగొన్న బెంగాల్‌ కరువు ప్రాంతాలలో పర్యటించి, అక్కడి ఆకలి చావుల దృశ్యాలను చిత్రబద్ధం చేశాడు. యుద్ధాలను వ్యతిరేకిస్తూ, శాంతికోరుతూ బొమ్మలు గీశాడు. స్త్రీ పురుషుల మధ్య ప్రేమను, అనురాగాన్ని, అనుబంధాలను తెలియజేస్తూ కూడా చిత్రాలు వేశాడు. ఆయన రేఖలలో అంగాంగ ప్రదర్శనలు, అశ్లీలతలు కనిపించవు. అనుబంధ సౌందర్యం కనబడుతుంది. నాజూకైన ఒంపుల గీతలు కావవి. నవ ప్రపంచ స్వప్న సమూహ కదలికలు. మాట్లాడే ఫొటోగ్రాఫులవి. నలుపు తెలుపులయినా మనల్నిట్టే ఆకట్టుకునే చిత్రజ్వాలికలు. అందుకనే ఆయన ప్రపంచ ప్రసిద్ధ ప్రజా చిత్రకారుడు.
విప్లవ కార్యకలాపాలకు, ఆలోచనలకు కేంద్రమైన చిట్టాగాంగ్‌, బంకురాలలో విద్యను అభ్యసించిన చిత్తప్రసాద్‌ 1915 జూన్‌ 21న జన్మించారు. అతనికి ఇష్టమైన చిత్రకళావిద్యను అభ్యసించాలనుకుని కలకత్తా గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌లో చేరాలనుకుంటే, దాని ప్రిస్సిపాల్‌ రాజకీయాలలో పాల్గొననని రాసిస్తే సీట్‌ ఇస్తానని షరతు పెట్టాడు. చిత్తప్రసాద్‌ ఆ షరతును తోచిపుచ్చి ప్రజల మధ్యనే తన కళకు సానపట్టాడు. ‘నీకు మేం నేర్పేది ఏమీలేదు. నీ పద్ధతిలోనే అలా కొనసాగించు. ఒకనాటికి మమ్మల్ని మించి పోతావు’ అని శాంతినికేతన్‌ ఆనాటి నిర్వాహకుడు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, నందలాల్‌ బోస్‌ల ప్రశంసలు అందుకున్నాడు. బెంగాలీ జానపద గాథలను తన స్వంత బాణీలో తిరగరాసి, తన బొమ్మలతో ప్రచురించాడు. భారతీయ, విదేశీయ, ఆధునిక కళారీతులను అధ్యయనం చేశాడు. తన శైలికి అన్వయించుకున్నాడు. ఆయన కేవలం చిత్రకారుడే కాదు. కవి, రచయిత, గాయకుడు కూడా. ఆనాటి అభ్యుదయ రచయితల సంఘం, ప్రజా కళాకారుల సమూహంతోని అనుబంధం కలిగి వుండి జన కళకు జీవం పోశారు. తన కళను అమ్మి జీవించడానికి ఎప్పుడూ నిరాకరించేవాడు. నమ్మిన సిద్ధాంతానికి నిబద్ధుడై వున్నాడు. అతని ప్రతిభను మనకంటే విదేశీయులే ముందు గుర్తించారు. చెకొస్లేవేకియాలో ఇతనిపై డాక్యుమెంటరీ చిత్రం నిర్మించారు. రష్యా, దుబారు, అమెరికా, ఢిల్లీ, ముంబయిలలో ఈయన చిత్రాలు భద్రపరచబడ్డాయి. 1978 నవంబరు 13న 63 ఏండ్లకే మరణించినా ప్రజా కళాకారులు నిత్యం స్మరణీయంగానే వుండే అమరులు. చిత్తప్రసాద్‌కు విప్లవ జోహార్లు.

– కె.ఆనందాచారి, 9948787660

Spread the love