మీ-సేవ కేంద్రాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

నవతెలంగాణ – హైదరాబాద్: మీ-సేవ కేంద్రాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రయివేట్ కు చెందిన వందలాది సేవలు అందిస్తున్న మీసేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయనుంది. కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగా ఆదేశించింది.  పంద్రాగస్టు నాటికి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,524 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో మూడు వేల వరకు నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలు ఉండగా వేయిన్నర వరకే గ్రామాల్లో ఉన్నాయి. ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ సేవలు, దరఖాస్తులు, చెల్లింపులు సహా 150కి పైగా ప్రభుత్వ, 600కు పైగా ప్రయివేట్ కార్యకర్తల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలు, నగరాల్లోని కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది.

Spread the love