Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామంలో రైతులతో కలెక్టర్, ఎమ్మెల్యే ముఖాముఖి,

గ్రామంలో రైతులతో కలెక్టర్, ఎమ్మెల్యే ముఖాముఖి,

- Advertisement -

– తేమ శాతం పరిశీలించి ధాన్యం తీసుకురావాలి
– రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు అప్రమత్తంగా ఉండాలి

– జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
నవతెలంగాణ – ఊరుకొండ 
నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం రాచాలపల్లి గ్రామ పర్యటనలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గ్రామంలో వరి ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతు వద్దకు వెళ్లి పంట దిగుబడి, ధాన్యం నాణ్యత, కొనుగోలు కేంద్రాలకు తరలింపు ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లే ముందు తప్పనిసరిగా తేమ శాతం సరిచూసుకోవాలని రైతులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత తేమ శాతం ఉన్న ధాన్యాన్నే వెంటనే కొనుగోలు చేస్తారని తెలిపారు. అలాగే ధాన్యంలో, రాళ్లు, మట్టి లేకుండా శుభ్రంగా ఉంచితే కొనుగోలు ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని వివరించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరుగుతుందని, ధాన్యం సేకరణ పూర్తైన తర్వాత 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ తెలిపారు.

రైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.

అనంతరం గుడిగానిపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక పాఠశాల భవనాన్ని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రమాదకరంగా మారిన భవనాన్ని తొలగించి, నూతన పాఠశాల భవన అనుమతులు ఇవ్వాలని కోరగా, అందుకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం, పీడీ హౌసింగ్ సంగప్ప, డీపీవో శ్రీరాములు, ఆర్డీవో జనార్దన్ రెడ్డి, తహసీల్దార్ యూసుఫ్ అలీ, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -