గ్రామ పంచాయితి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 లోగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్ మాలవియాతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించడం జరిగిందని, ఈ నెల 7వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామపంచాయతీ లలో ముసాయిదా జాబితాను ప్రదర్శించడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 473 గ్రామ పంచాయతీలు, 3870 వార్డులు ఉండగా, 3888 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని, ఈ ముసాయిదా జాబితా పై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల, 12 న అన్ని మండలాల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారని వచ్చిన అభ్యంతరాలను 13 వ తేదీన పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. తుది ఓటరు జాబితాను 2024 డిసెంబర్ 17న ప్రచురించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జడ్పి సీఈఓ జితేందర్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీలత, డీఎల్పీఓ ఫణీంద్ర,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.