ఖానాపూర్‌ చెరువు సర్వేను అడ్డుకున్న కాలనీవాసులు

Adilabadనవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
రెండు రోజులుగా పట్టణంలోని ఖానాపూర్‌ చెరువులోని అక్రమణాలను గుర్తిస్తూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. దీని కోసం కలెక్టర్‌ రాజర్షి షా మున్సిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో ఒక బృందం తయారు చేశారు. ఇలా నాలుగు బృందాలను ఏర్పాటు చేసి ఖానాపూర్‌ ఎఫ్‌టిఎల్‌ బౌండ్రిలను గుర్తించేందుకు సర్వే చేయాలని సూచించారు. రెండవ రోజు శుక్రవారం ఖానాపూర్‌, అంబేద్కర్‌నగర్‌ కాలనీల మధ్యలో సర్వే కొనసాగించారు. ఇండ్లు కూలుస్తారంటూ కాలనీ వాసులు పలువురు సర్వేను అడ్డుకున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో సర్వేలు చేయించబోమని స్పష్టం చేశారు. కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూలిస్తే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. అంతకు ముందు అధికారులు ఇండ్ల వద్దకెళ్లి వారి పేర్లు, రేషన్‌ కార్డు, నిర్మాణ ఏరియా, ఎప్పటి నుంచి ఉంటున్నారు.. తదితర వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్‌ డీఈ ప్రేమ్‌సింగ్‌ మాట్లాడుతూ మ్యాప్‌ ప్రకారం ఖానాపూర్‌ చెరువు 144 ఎకరాల 30 గుంటలు ఉందన్నారు. ఎంబీటీలోని ఎఫ్‌టిఎల్‌ బౌండరీలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు జరిగాయని, వాటి గురించి తెలుసుకోవడానికి కలెక్టర్‌ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారని తెలిపారు. ఏరియాల్లో పర్యటించి కొలతలను తీసుకొని కలెక్టర్‌కు అందిస్తామన్నారు. మురుగు నీటిని శుద్ది చేసే కేంద్ర ప్రభుత్వ ఎస్పీజీ కూడా రానుందని తెలిపారు. అందుకే ముందస్తుగా అన్ని సర్వేలు చేసి నివేదిక సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు.

Spread the love