– మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహాశివరాత్రి సందర్భంగా 12 ఏండ్లకు ఒకసారి జరిగే జోగులాంబ అమ్మవారు, బాల బ్రహ్మేశ్వర స్వామికి నిర్వహించే కుంభాభిషేకంలో పాల్గొనాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి పురేందర్ కుమార్, ప్రధానార్చకులు ఆనంద శర్మ ఆహ్వానించారు. సోమవారం సచివాలయంలో వారు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలును అందించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.
రుద్రారం పారువేటకు రండి
కర్నూలు జిల్లా అహౌబిలం రుద్రారం గ్రామంలోని నరసింహస్వామివారికి నిర్వహించే పారువేట ఉత్సవంలో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పించాలని కోరుతూ మంత్రి కొండా సురేఖను ఆ ఆలయ పాలకమండలి ఆహ్వానించింది. కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించిన ఈ దేవాలయంలో జరిగే పారువేట ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించాలని అహౌబిలం పీఠాధిపతి ఆహ్వాన పత్రాన్ని పాలకమండలి సభ్యులు మంత్రికి అందచేశారు. ఈనెల 28న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.