రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సుమారు తొమ్మిది లక్షల మంది వుంటారు. వీరి సమస్యలు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో వున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో ఉద్యోగుల ప్రధాన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర నిరాశతో పనిచేశారు. ఇప్పడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారితో జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో కొన్ని హామీలిచ్చారు. తరువాత కాలయాపన జరగడంతో సెప్టెంబర్ 24న 200 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలన్నీ జెఏసిగా ఏర్పడ్డాయి. మరికొన్ని సంఘాలు ఇంకో జెఏసి ఏర్పాటుచేశాయి. ప్రభుత్వానికి వినతిపత్రమిచ్చి కార్యాచరణ ప్రకటించ డంతో జెఏసి సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. తరువాత ఒక డిఏ మాత్రమే ప్రకటించారు. మిగిలిన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. మంత్రివర్గ ఉపసంఘం వేసి చేతులు దులుపుకున్నది. ఈ చర్యలు ఉద్యోగుల ఆశలను అడియాశలు చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలకు ఉద్యోగుల కోర్కెలకు పోటీ పెట్టడం సమంజసం కాదు.
రెండో పిఆర్‌సి వెంటనే ఇవ్వాలి
తెలంగాణ తొలి పిఆర్‌సి జీఓలు 2021 జూన్‌లో విడుదల చేసిన 1జులై2018 నుండి ఉద్యోగులకు వర్తింపచేశారు. ఇది 1జులై2023తో కాలపరిమితి ముగిసింది. 16 నెలల గడిచింది. ఇప్పటికే పిఆర్‌సి కమిషనర్, ఉద్యోగ సంఘాలతో సంప్ర దింపులు పూర్తయ్యాయి. పెరిగిన ధరలకునుగుణంగా 51శాతం ఫిట్‌మెంట్‌తో రెండో పిఆర్‌సి రిపోర్టు తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని సంఘాలన్నీ కోరుతున్నాయి. పిఆర్‌సి అమలు కోసం వేగవంతంగా చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పిఆర్‌సిలో అన్యాయం జరుగుతున్నది. 2021 జూన్‌లో జీవో నెం.60 ద్వారా వేతనాలు సవరించారు. ఉమ్మడి రాష్ట్రంలో పర్మినెంట్ ఎంప్లాయీ బేసిక్ ఇచ్చేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్యాయం జరిగింది. పర్మినెంట్ ఎంప్లాయీస్ మినిమం బేసిక్ ఇవ్వకుండా గతంలోని వేతనంపై 30శాతం మాత్రమే పెంచి అన్యాయం చేశారు. దీనివల్ల మూడు కేటగిరీలలో రూ.15,600, రూ.19,500, రూ.22,750 మాత్రమే పొందుతున్నా రు. అది కూడా 2018 నుండి కాకుండా 2021 జూన్ నుండి అమలు చేశారు. రెండేండ్ల వేతనాలు నష్టపోయారు. కొన్ని డిపార్ట్‌మెంట్‌లలో ఇంకా ఆలస్యం చేశారు. కావున ఈసారి అలా కాకుండా పర్మినెంట్ ఉద్యోగులతో పాటు వెంటనే అమలు చేయాలి. కనీస వేతనం రూ.26వేలకు తగ్గకుండా నిర్ణయించాలి.
నాలుగు పెండింగ్ డిఏలు విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1జులై 2022 నుండి 1జులై 2024 వరకు ఐదు డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి. టీఆర్‌ఎస్ కాలంలో మూడు, కాంగ్రెస్ కాలంలో రెండు డిఏలు పెండింగ్‌లో పడ్డాయి. డిఏల రూపంలో 17.22శాతం వేతనం రావాల్సి ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అందరు ఐదు డిఏల కోసం పోరాడితే 1జులై2022 నాటి డిఏ 3.64శాతం మాత్రమే మం జూరు చేసింది. ఇంకా నాలుగు డిఏలు పెండింగ్‌లో పెట్టింది. ఆర్థిక పరిస్ధితి సాకుతో డిఏలు ఇవ్వకపోవడం అన్యాయం. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి- సమాన వేతనమివ్వాలి. డిఏ, హెచ్ ఆర్‌ఏ తదితర అలవెన్సులివ్వాలి. రాష్ట్రంలో రెండు లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రతి శాఖలో వీరి సేవలు చాలా కీలకంగా వున్నాయి.
ఇతర ప్రధాన సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, జిపిఎఫ్ తదితర బిల్లులు చాలా కాలంగా పెండింగ్‌లో పెడుతున్నది. 2022 నుండి బిల్లులు క్లియర్ చేయడం లేదు. రిటైర్ అయిన ఉద్యోగుల గ్రాట్యుటీలాంటివి కూడా 2027 నాటికి చెల్లిస్తామంటున్నది. ఇ-కుబేర్ వ్యవస్ధ వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లుల విడుదల కోసం సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. లంచాలిస్తేనే బిల్లులు విడుదల చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ-కుబేర్ వ్యవస్ధను రద్దు చేసి ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ద్వారా క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించాలి. ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.
ఎంప్లాయీస్ హెల్త్ స్కీంను (ఇహెచ్‌ఎస్) అన్ని హాస్పిటల్స్‌లో అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగులు ఆసుపత్రి ఖర్చులతో అప్పుల పాలౌవుతున్నారు. ప్రభుత్వం, లబ్ధిదారులు సమాన సహకారంతో అమలు చేస్తామన్నారు. కానీ అమలు చేయడం లేదు. వాస్తవంగా ప్రభుత్వవాటా ధనంతో ఉచితంగా ఉద్యోగులకు ఇహెచ్‌ఎస్ అమలు చేయాలి.
మరో ముఖ్యమైన సమస్య కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) ఉద్యోగుల సమస్య. రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. 2004 నుండి నేటి వరకు నియమించబడిన వారికి ఈ స్కీమ్ అమలు చేస్తున్నారు. ప్రతి ఉద్యోగి నుండి వేతనంలో ప్రతినెల 10శాతం కట్ చేస్తున్నారు. ఇప్పటివరకు జమ అయిన వందల కోట్లు వివరాలు తెలియదు. రెండు దశాబ్ధాలుగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 24వ అంశంగా సిపిఎస్‌ను రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ (ఓపిఎస్) విధానాన్ని అమలు చేస్తామని చెప్పింది. కానీ నేటికీ అటువైపు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఇటీవల కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన యునైటెడ్ పెన్షన్ స్కీమ్ (యుపిఎస్)ను తిరస్కరించాలి.
317 జీఓ వల్ల ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికత పునాదులపై కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్ధానికత అంశానికి చోటు లేకుండా చేశారు. మల్టీజోన్స్, జోన్స్‌గా రాష్ట్రాన్ని విడగొట్టి ఉద్యోగులను సుదూర ప్రాంతాలకు పంపారు. ఉద్యోగుల కుటుంబాలను చిన్నాభిన్నం చేశారు. ఈ సమస్యపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో చర్చించి నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చింది. 317 జీవోను సవరించి స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలి.
2.5 లక్షల మంది పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి. పెన్షనర్లకు సపరేట్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి. వైద్య ఆరోగ్య శాఖలో జీవో నెం.142 తోపాటు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 42 జీవోను సమీక్షించాలి. కారుణ్య నియామకాల సమస్య పరిష్కరించాలి. కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీలు రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే జీత భత్యాలు చెల్లించాలి. విఆర్‌ఓ, విఆర్‌ఏ, నాల్గవ తరగతి ఉద్యోగులు, గురుకులాలు, మోడల్ స్కూల్, రెసిడెంట్ స్కూల్స్, వైద్యవిధాన పరిషత్, మార్కెటింగ్, ఎయిడెడ్, యూనివర్సిటీ తదితర ఉద్యోగుల ప్రధాన సమస్యలు పరిష్కారం చేయాలి. నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి.
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ ఏర్పడటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాలతో అనేక ఫలితాలు పొందారు. కార్మిక సంఘాలను కూడా కలుపుకొని వెళ్లారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారమ వుతాయి. టిజిఓ, టిఎన్‌జిఓలు, ఉపాధ్యాయ సంఘాలు ఇతర విభాగాల ఉద్యోగ సంఘాలు ఈ వైపున అడుగులు వేయడం ఒక ముందడుగు. సీఐటీయూ ప్రతి సందర్భంలో ఉద్యోగుల పక్షాన నిలిచింది. పోరాడితేనే సమస్యలు పరిష్కారమవు తాయి.అడుక్కుంటే హక్కులు నెరవేరే కాలం కాదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాన్చివేత ధోరణి విడనాడి, కమిటీల పేరిట కాలయాపన చేయకుండా సమస్యలు పరిష్కరించాలి.
– భూపాల్, 9490098034