చట్టసభలో.. కమ్యూనిస్టులు గళం విప్పాల్సిన అవసరం ఉంది

నవతెలంగాణ – చండూరు:  ప్రభుత్వాలను ప్రశ్నించడానికి, చట్టసభలలో  ప్రజా సమస్యలపై   నిలదీయడానికి కమ్యూనిస్టుల గళం   విప్పాల్సిన అవసరం  ఉందని సీపీఐ(ఎం) మునుగోడు అభ్యర్థి దోనూరు నర్సిరెడ్డి  అన్నారు.  శనివారం మండలంలోని తుమ్మలపల్లి, బంగారిగడ్డ, అంగడిపేట చండూరు, శీర్దపల్లి గ్రామాలలో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు  తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేలుగా కమ్యూనిస్టులు లేకపోవడం వల్ల  ప్రజల తరఫున మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది అన్నారు. చండూర్ ప్రాంతం కమ్యూనిస్టుల అడ్డా అని, తాను కూడా ఆరు సంవత్సరాలుగా చండూరులో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాను అని గుర్తు చేశారు. మునుగోడు నియోజకవర్గం లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు  పార్టీలు మారి నియోజకవర్గ ప్రజల ముందు చులకనగా రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారన్నారు. సంవత్సర క్రితం మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి బీజేపీకి, బీజేపీ నుండి కాంగ్రెస్కు మారి పోటీ చేయడం వీళ్ళ వ్యాపారం కోసం పదవులను అడ్డం పెట్టుకొని కోట్లకు పడగలేతడం  తమ అభివృద్ధి మీద ఏ మాత్రం శ్రద్ధ లేదని  అన్నారు. అనునిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులను గెలిపిస్తే ప్రజా సమస్యలతో పాటు పేద ప్రజలకు అందాల్సిన పథకాలను ప్రజలకు అందించేందుకు, ప్రశ్నించే గొంతుగా పనిచేసేందుకు తమను  సుత్తి కొడవలి నక్షత్రంపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.  అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చెందాల్సిన పకృతి సంపదను పెట్టుబడుదారులకు చౌక ధరల్లో పెట్టుబడుదారులకు కట్టబెట్టడంతో పెట్టుబడుదారులు ధరలు అధికంగా పెంచి ప్రజల నడ్డి విరిగే విధంగా ప్రభుత్వాలు 300కు ఉన్న గ్యాస్ సిలిండర్ 12 వందల కు పెంచడంతో పేద ప్రజలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం నిరుద్యోగుల సమస్యలను తీర్చేందుకు రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలలో 20 కోట్ల నిరుద్యోగుల భర్తీ ఎక్కడ చేశావో చూపించాలని కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు. గత పది సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించకుండా దళిత బందు పథకం ఆశ చూపి మరోసారి పేద ప్రజలను మోసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద కుట్ర కు తెరలేపిందని అన్నారు. రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పరికరాలను, విత్తనాలను అందించకుండా రైతుబంధు పథకాన్ని అడ్డం పెట్టుకొని రైతులను మోసం చేస్తున్నదని ఆరోపణ చేశారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ  సభ్యులు బండ శ్రీశైలం, మొగుదాల వెంకటేశం, బొట్టు శివకుమార్, జరిపోతుల ధనంజయ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.
Spread the love