
ఇంజనీరింగ్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనులు పరిశీలన
నవతెలంగాణ – తాడ్వాయి
వచ్చే నెల ఫిబ్రవరిలో జరుగు మేడారం మహా జాతర భక్తుల సౌకర్యార్థం జరుగు అభివృద్ధి పనులను నాణ్యతగా సకాలంలో త్వరితగతిన పూర్తి చేయాలని ఏటూర్ నాగారం ఐటిడీపీఓ అంకిత్ అన్నారు. శనివారం ఇంజనీరింగ్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించారు. మేడారం ఐటీడీఏ అతిథి గృహంలో మరమ్మతు పనులను పరిశీలించి, పనులు వేగవంతం చేసి రెండు రోజుల్లో పూర్తి చేయాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్లను ఆదేశించారు.అనంతరం జంపన్నవాగు వద్ద శాశ్వత దుస్తులు మార్చుకునే గదులను పరిశీలించి, యాత్రికుల ఉపయోగం కోసం సరైన నిర్వహణ కోసం గ్రామ పంచాయతీకి అప్పగించాలని గిరిజన సంక్షేమ ఇంజినీర్లను ఆదేశించారు. మ్యూజియాన్ని సందర్శించి, భవనానికి సంబంధించిన పెయింటింగ్ పనిని పరిశీలించారు. పెయింటింగ్ లు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ స్థాయిలో తెలిసే విధంగా ఉండాలి, మ్యూజియం కాంపౌండ్ వాల్‌కు పెయింటింగ్‌ను కూడ వారం రోజుల్లో పూర్తి చేయాలనీ చిత్రకారుడిని ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని సులభ్ కాంప్లెక్స్‌ను పరిశీలించి, దాని నిర్వహణ కోసం వెంటనే గ్రామపంచాయతీకి అప్పగించాలని అధికారులు ఆదేశించారు. అనంతరం తాడ్వాయి మండల కేంద్రంలోని కిచెన్ కం డైనింగ్ హాల్ టాయిలెట్ బ్లాక్‌లు కిచెన్ షెడ్లు కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. రేపటి లోగ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్శనలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వసంత్ రావు, ఐటిడిఎ స్టాటిస్టికల్ ఆఫీసర్ రాజ్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ చందర్, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీమతి దేవిశ్రీ, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీరాము తదితరులు పాల్గొన్నారు.