మేడారం జాతర పనులు త్వరితగతిన పూర్తి చేయండి..

– ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి
– మేడారం జాతర పనులు క్షేత్రస్థాయిలో పరిశీలన
నవతెలంగాణ -తాడ్వాయి 
వచ్చేనెల ఫిబ్రవరిలో జరుగు మేడారం మహా జాతర కు జరుగు అభివృద్ధి పనులను సకాలంలో నాణ్యతగా పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. శనివారం మేడారం లో  జాతర పనుల పురోగతిని వివిధ శాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించి, పరిశీలించారు. హరిత హోటల్, దేవాలయ పరిసరాలు, ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్, ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఊరట్టం రోడ్డు అభివృద్ధి పనులు, కన్నేపల్లి సారలమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ శాఖల ద్వారా  ప్రతిపాదిత పనులన్నీ  ఈ నెలాఖరుకు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాత్కాలిక పనులు, అప్పటికప్పుడు చేయాల్సినవి ప్రణాళికాబద్ధంగా పూర్తికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి, పనుల పర్యవేక్షణ చేస్తున్నట్లు, ప్రతిరోజు పనుల పురోగతిని సమీక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పనులు నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా జిల్లా స్థాయి అధికారులతో జోనల్ వైజ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు, ఈ బృందాలు ప్రతిరోజు క్షేత్ర సందర్శన చేసి, పనుల నాణ్యత, త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకొంటాయని, పనుల పురోగతిపై ప్రతిరోజూ నివేదిక సమర్పిస్తాయని కలెక్టర్ అన్నారు.  కన్నేపల్లి సారలమ్మ దేవాలయం వద్ద టాయిలెట్స్ మరమ్మతులు చేయించాలని, సెంటర్ లో ఉన్న వీధి దీపాల మరమత్తులు చేపట్టి వెంటనే అందుబాటు లోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని సదుపాయాలకల్పనకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈ ఓ రాజేందర్, ఈ ఈ పి అర్ అజయ్ కుమార్, డి పి ఓ వెంకయ్య, తాడ్వాయి తహసిల్దార్ రవీందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love