ఐడియల్‌ నాగసూరికి అభినందనలు

మా ఐడియల్‌ ఫ్రెండ్‌ నాగసూరి వేణుగోపాల్‌. ఎందుకంటే చాలా సాధారణంగా, కుగ్రామంలో మొదలైన ఆయన జీవితం ఎంతో స్ఫూర్తి దాయకం. బాల్యంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. చదువుతో పాటు రచన మీద కూడా ఆసక్తి చూశారు. అటు చదువు, ఇటు రచనలు, ఉద్యోగం, కుటుంబ జీవితం… వీటన్నింటినీ సమాంతరంగా, సమర్ధవంతంగా నిర్వహించడం కొద్ది మందికే సాధ్యం. మా ఫ్రెండ్‌ విద్యార్హతలు, రచనలు గమనిస్తే ఈతరం సమాజానికి కావలిసిన మొత్తం ఆలోచనా విధానం ఏమిటో మనకు ఒక నిర్దేశనంగా దొరుకుతుంది.
విప్లవం అంటే హింసా మార్గమే, ఆయుధాలు పట్టడడమే అన్న మిస్‌ కాన్సెప్షన్‌ను మన మీద రుద్దుతున్న సమయంలో ‘అసలైన విప్లవవాది, సిసలైన సిద్ధాంత కర్త మహాత్మాగాంధీ’ అనే సంచలన పుస్తకం ద్వారా ఆ మిస్‌ కాన్సెప్శన్‌ను విజయవంతంగా బ్రేక్‌ చేసాడు. నిజమే కదా ద్వేషం, హింస లేని నిరసన అనేది ఎంత అద్భుతమైన ఆలోచన. 200 ఏండ్లు మన దేశాన్ని దోచుకున్న బ్రిటీష్‌ వలసపాలకుల మీద ద్వేషం రావడం, భౌతికంగా నిర్మూలన చేయాలి అన్న ఆవేశం రావడం సహజమే. అయితే మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని, వాటిని ద్వేషం, పగ, హింస వైపు కాకుండా శాంతి యుత నిరసన వైపు మరల్చడం, మొత్తం దేశాన్ని, ప్రపంచాన్ని కూడా అహింసాయుత మార్గం గురించి కన్విన్స్‌ చేయగలిగిన గాంధీజీనే అసలైన విప్లవవాది అని నాగసూరి అంటారు.
మన విద్యా విధానం కేవలం పరీక్షల్లో మార్కులు రావడమే ప్రతిభకు కొలమనంగా మారుతున్న సందర్భంలో, అక్కడ సైంటిఫిక్‌ దృక్పథంతో కూడిన ఆలోచనలు వృద్ధి చేసే ప్రయత్నాలు లోపించిన సందర్భంలో, ఆ ఖాళీలు పూరించడానికా అన్నట్లు, సైన్స్‌ దృక్పధం మీద సుమారు 25 పుస్తకాలు రాయడం విద్యార్ధిలోకానికి వారు చేస్తున్న అతిపెద్ద కంట్రిబ్యూషన్‌. అలాగే పర్యావరణం మీద నాలుగు పుస్తకాలు రాశారు. గాంధీజీ అభివృద్ధి నమూనా కూడా పర్యావరణానికి హాని చేయని, అనవసరమైన సంపద ప్రోగు చేయని అభివృద్ధి నమూనానే! ఆ ఆలోచనలకు తగ్గట్లే పర్యావరణం పరిరక్షణ మీద అమితమైన ఆసక్తి ఉండటం విశేషమైన విషయం. అలాగే స్వీయరచనలు, సంపాదకీయాలు కలిపి తెలుగు సాహిత్యం మీద కూడా సుమారు పాతిక దాకా ఉంటాయి.
అల్‌ ఇండియా రేడియోలో పని చేసిన అపారమైన అనుభవం నుండి, జర్నలిజం, టెలివిజన్‌ రంగాల గురించి కూడా పుస్తకాలు రాశారు. ఈ పుస్తకాల ద్వారా ఇచ్చిన సూచనలు, చర్చించిన విషయాలు, మనం వంటపట్టించుకోవడం అవసరం. మీడియా విశ్వసనీయతకు కృషి చేయాలి అని, ఆర్థికాభివృద్ధి పర్యావరణానికి హాని చేయకుండా ముందుకు వెళ్ళాలని, విద్యా విధానం శాస్త్రీయ దృక్పథం కలిగిన ఆలోచనల వైపు ఉండాలని, సాధికారికంగా తమ పుస్తకాల ద్వారా మనకు తెలియపరచారు. అదికూడా సులభమైన భాషలో, సబోధకమైన శైలిలో, ఎక్కువ నిడివి లేకుండా సంక్షిప్త రూపంలో మనకు అందించారు. ఒక్క వ్యక్తి ఇన్ని వైవిధ్యభరితమైన సబ్జెక్ట్స్‌ మీద రచనలు సాగించడం అబ్బురం అనిపించే విషయం. మా ఐడియల్‌ ఫ్రెండ్‌ నాగసూరి వేణుగోపాల్‌ ఇలానే మాకు మరింత నాలెడ్జ్‌ ఇవ్వాలి. ఇపుడు దేశంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, గాంధీజీ భావజాలాన్ని ఇలానే చాలా లౌడ్‌గా మన తెలుగు ప్రజలకు అందించాలి.
(జానమద్ది సాహితీ పీఠం 11వ సాహిత్య సేవా పురస్కారం అందుకుంటున్న సందర్భంగా)
– చేగో, 8520046222

Spread the love