కాంగ్రెస్‌దే విజయం

Congress is the winner– బీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదు
– ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తాం
– బీఆర్‌ఎస్‌, బీజేపీ,ఎంఐఎం ఒక్కటే..
– కులగణన చేసేందుకు ఆ పార్టీలు జంకుతున్నారు : ప్రచార యాత్రలో రాహుల్‌గాంధీ
నవతెలంగాణ-భూపాలపల్లి/ కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / పెద్దపల్లి టౌన్‌/ కరీంనగర్‌
‘తెలంగాణలో సునామిలా కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడబోతోంది. వచ్చేది మన ప్రజల ప్రభుత్వమే. బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు గోస పడుతున్నారు.. బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు. పేదల ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్‌వైపే ఉంది.. కుల గణన చేపట్టేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ జంకుతున్నారు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతాం. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం..’ అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర, రోడ్‌షోల్లో పాల్గొంటున్న రాహుల్‌గాంధీ సహా పలువురు నేతలు గురువారం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా నుంచి కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించారు. కాటారం, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అనంతరం కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. నగరంలోని రాజీవ్‌చౌక్‌లో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఆయా సభలు, కార్నర్‌మీటింగ్‌లలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. ఈ ప్రాంతంతో తమకు ప్రేమతో కూడిన కుటుంబ సంబంధం ఉందన్నారు. ఇక్కడ తమ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గౌరవించి సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. అయితే, తెలంగాణ ప్రజల కలలను కాలరాస్తూ ఇక్కడి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోపిడీకి తెగబడిందన్నారు. కాళేశ్వరంతో ఎక్కడైనా నీళ్లు వచ్చాయా? కనీసం ఎవరికైనా లాభం జరిగిందా?, రూ.లక్ష రుణమాఫీ ఏ రైతుకైనా వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌ పేరుతో పేదల భూములు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు కాజేస్తున్నారన్నారు. రైతుబంధు తో ధనిక రైతులకే లాభం చేకూరుతోందని, తమ ప్రభుత్వం వచ్చాక భూమిలేని రైతులకూ సాయం అందిస్తామని వివరించారు. దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్‌, పేదల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తానని ప్రధాని మోడీ ఇద్దరూ ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
రామగుండం సింగరేణి కార్మికులతో తాను మాట్లాడానని, సింగరేణి గనులు ప్రయివేటుపరం కానివ్వబోమని హామీ ఇచ్చారు. సింగరేణిని అదానీకి అప్పజెప్పేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తే అడ్డుకున్నామని తెలిపారు. దేశంలోని గనుల ప్రయివేటీకరణకు తాము వ్యతిరేకంగా పోరాడి ఆపగలుగుతున్నామని వివరించారు. ప్రభుత్వ కంపెనీలకు ఒక రేటుతో, ప్రయివేటు కంపెనీలకు మరో రేటుతో దేశ సంపదను కొల్లగొడుతున్నారని చెప్పారు. ఓబీసీల జపం చేసే ప్రధాని మోడీ ప్రభుత్వంలో 90 మంది కార్యదర్శులు ఉంటే.. వారిలో ముగ్గురే ఓబీసీలు ఉన్నారని తెలిపారు. పేదలకిచ్చే స్కీములకు ఎన్ని నిధులు కేటాయించాలి?., ప్రభుత్వ ఆస్తులు ఏవి అమ్మాలనే లెక్కలు తీస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని తాను ప్రశ్నిస్తే పార్లమెంట్‌లో మోడీ కనీసం సమాధానం ఇవ్వలేదన్నారు. పైగా బీజేపీని ప్రశ్నిస్తున్నాననే కక్షతో తనపై 27అక్రమ కేసులు బనాయించి పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి.. ఇంటిని సైతం ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాను వెనక్కి తగ్గనని, ప్రజల పక్షానే పోరాడుతానని చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు. వచ్చిన తొలి రోజుల్లోనే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి ఆయా కులాల వారీగా రాజకీయంగా, ఆర్థికంగా న్యాయం చేకూర్చుతామని అన్నారు.
ఇచ్చిన ప్రతిమాటనూ నిలబెట్టుకుంటాం
‘రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటాం. ప్రతిపేద మహిళకు రూ.2500 మొదలుకుని ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేస్తాం’ అని రాహుల్‌గాంధీ అన్నారు. ఇందుకు కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో తమ ప్రభుత్వాల హామీల అమలును ప్రజలు గమనించాలని కోరారు. కేసీఆర్‌, ఆయన కుటుంబ పరివారం జనం సొమ్మును జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణం పేరుతో రూ.లక్ష కోట్లు అవినీతి చేసినా ఈ సర్కారుపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరగవని, అదే బీఆర్‌ఎస్‌కు, బీజేపీకి మధ్య ఉన్న మైత్రిని తేటతెల్లం చేస్తోందని అన్నారు. ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్న మోడీ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు చేయించట్లేదని ప్రశ్నించారు.
ఏ ఒక్క హామీనీ బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాయని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటయ్యాయని విమర్శిం చారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పాలన కేంద్రంలోని నరేంద్ర మోడీ రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా పనిచేస్తోందని ఎద్దేవా చేశారు.
దేశంలో అదానీలాంటి పారిశ్రామికవేత్తలు లక్షల కోట్లు అప్పు తీసుకుంటే వారు అడగకుండానే రుణమాఫీ చేస్తున్నారని, రైతులు, మహిళలు, యువకులు రుణాలు తీసుకుంటే రుణమాఫీ ఎందుకు చేయరని ప్రశ్నించారు. ఎంఐఎం, బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం అభ్యర్థులను నిలబెడుతూ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు. దేశ సంపద ఎవరి వద్ద ఉందో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక వెలికి తీసి పేద కుటుంబాలకు అందజేస్తామని తెలిపారు.
రాహుల్‌గాంధీ వెంట తెలంగాణ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాష్కి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్‌ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు ఉన్నారు.

Spread the love