– అశ్వారావుపేట అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా..?
నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమా అంటూ కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీతో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, అశ్వారావుపేట మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత తామే తీసుకొచ్చినట్లు బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వంద పడకల ఆసుపత్రి మంజూరు, నిధుల విడుదల, శంకుస్థాపన, భవన నిర్మాణ పనుల ప్రారంభం కాంగ్రెస్ పాలనలోనే జరిగాయని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసం నిర్మించిన వారు ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులను విమర్శించడం “దెయ్యాలు వేదాలు వల్లించినట్లు” ఉందని ఎద్దేవా చేశారు. అశ్వారావుపేట ప్రాంతంలో జరిగిన ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనూ, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు.
వ్యవసాయ కళాశాల, జూనియర్ కళాశాలలు, గ్రామీణ నీటి నిల్వ ట్యాంకులు, విద్యుత్ ఉపకేంద్రాలు, ఇందిరమ్మ ఇళ్లు, పామాయిల్ పరిశ్రమల ఏర్పాటు వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పాలనలో జరిగాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో మాత్రం ప్రజా అభివృద్ధి కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు.
గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో 14 విద్యుత్ ఉప కేంద్రాలు, 110 ట్రాన్స్ఫార్మర్ లు, 15 గ్రామాల్లో 100 శాతం శాతం సీసీ రహదారుల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా అశ్వారావుపేట లో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాల ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు.
అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పినా ఆ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేశ్‌బాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు జూపల్లి వెంకటరామారావు, తుమ్మ రాంబాబు, కోలా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.



