Monday, July 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపట్టిసీమకు నీళ్లు వదిలేందుకే మేడిగడ్డపై కుట్ర

పట్టిసీమకు నీళ్లు వదిలేందుకే మేడిగడ్డపై కుట్ర

- Advertisement -

గురువు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ
ఇగో పక్కన పెట్టి తెలంగాణ రైతులను ఆదుకోండి
ఎన్టీపీసీతో పాటు హైదరాబాద్‌కు ‌
తాగునీటి కష్టాలు తప్పవు : మాజీ మంత్రి హరీశ్‌‌రావు హెచ్చరిక

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‌పట్టిసీమకు నీళ్లు వదిలేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి గత రెండేండ్లుగా మేడిగడ్డకు మరమ్మత్తు చేయకుండా తాత్సారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌‌రావు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోటార్లు బంద్ పెట్టి, నీళ్లను కిందకు వదిలేస్తూ ఆంధ్రా ఆయకట్టుకు మేలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎల్‌‌నినో కరువు పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్కా ముఖ్యమని నిపుణులు చెబుతున్న మాటలను సీఎం ఖాతరు చేయడం లేదన్నారు. ప్రస్తుతం గోదావరిలో పారుతున్న 50 వేల క్యూసెక్కుల వరదను కన్నెపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోయాలని డిమాండ్‌ ‌చేశారు. దేవాదులలో 10 మోటార్లు ఉంటే 4 మాత్రమే నడుపుతూ.. 2,500 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట కేవలం 1,200 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతున్నారని ఆరోపించారు. ఫలితంగా వరంగల్, ధర్మసాగర్, పాలకుర్తిల్లో 75 శాతం చెరువులు ఎండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మొన్నటి వరకు గోదావరిలో నీళ్లే లేవని అబద్ధం చెప్పిన సీఎం… పారుతున్న గోదావరిని లైవ్ లో చూపించగానే మాటమార్చి కొత్త పల్లవి ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నెపల్లి మోటార్లు ఎలా నడుపుతారంటూ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

2028లో 28 లక్ష‍లు, 2025లో 15లక్ష‍ల క్యూసెక్కుల వరద వచ్చినా భద్రాచలానికి ఎలాంటి ముప్ప జరగలేదని గుర్తు చేశారు. అన్నారం, సుందిళ్ల రెండు బ్యారేజీల్లో మొత్తం 8 టీఎంసీలంటే దాదాపు 80 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే నిల్వ ఉంటుందని చెప్పారు. ఇదే విషయాన్ని తెలంగాణ రిటైర్డ్‌ ఇంజినీర్లు చెబితే సీఎం జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. నిన్నటి దాకా నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజినీర్లు అని చెప్పిన సీఎం.. ఇప్పుడు నీళ్లు ఎత్తమని టెక్నికల్ సూచన చేయగానే వారిని జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని హరీశ్‌‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడూ రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ సాధ్యం కాదని చెప్పలేదని గుర్తు చేశారు. మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు తీసుకెళ్లడం కష్టం కాబట్టి, వరస బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా తీసుకెళ్లమని జస్టిస్ ఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ ఇచ్చారని పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులు రూ. 8.5 కోట్ల ఖర్చుతో కాపర్‌ డ్యాం కట్టడం ద్వారా నీళ్లు ఎల్లంపల్లికి తీసుకువెళ్లొచ్చంటూ ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. దాన్ని వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

మేడిగడ్డపై రిపోర్ట్ ఇచ్చిన ఎన్డీఎస్‌ఏ చైర్మెన్‌ చంద్రశేఖర్ అయ్యర్, అతుల్ జైన్‌ల హయాంలోనే పోలవరం కాపర్‌ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ ఆరు సార్లు కొట్టుకుపోవడం వల్ల రూ.7 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందన్నారు. అలాంటి వారికి ప్రమోషన్లు ఇచ్చి ఇక్కడకు పంపితే మేడిగడ్డ 3 పిల్లర్ల కుంగుబాటుపై రిపోర్టులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. హిట్లర్ తనకు ఆదర్శం అన్న రేవంత్ రెడ్డి, అదే హిట్లర్ తరహాలో హంతక భాష మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇగోలకు, పంతాలకు పోయి రైతుల పంటలను ఎండబెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. తక్షణమే కన్నెపల్లి, దేవాదుల మోటార్లను పూర్తిస్థాయిలో ఆన్ చేసి రాష్ట్రాన్ని కరువు బారి నుంచి కాపాడలని సూచించారు. లేదంటే ఎన్టీపీసీ, సింగరేణితో పాటు హైదరాబాద్‌‌కు తాగునీటికి కష్టాలు తప్పవన్నారు. అదే జరిగితే ఎండిన ప్రతి పంటకు, రాలిన ప్రతి రైతు కన్నీటి బొట్టుకు తెలంగాణ సమాజం సీఎంను దోషిగా నిలబెడుతుందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -