
– జిపి కార్యదర్శికి వినతిపత్రం అందజేత
నవతెలంగాణ – రాయపర్తి
స్వచ్ఛమైన వాతావరణంలో జీవనాన్ని కొనసాగిస్తున్న తమకు కోళ్ల ఫామ్ ప్రకృతికి యమపాశంగా మారనుందని దాంతో స్థానికంగా ఉండే తమకు అనేక ఇబ్బందులు వస్తాయని పన్యా నాయక్ తండా ప్రజలు మంగళవారం ఆందోళన చేపట్టారు. వివరాల్లో వెళితే స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని పన్యా నాయక్ తండా సమీపంలో భారీ నిర్మాణంతో కోళ్ల ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కోళ్ల ఫామ్ వల్ల స్వచ్ఛమైన వాతావరణం కలుషితమవుతుంది అని బాధపడుతున్నారు. ఫామ్ నుంచి వచ్చే వ్యర్ధాల ద్వారా గాలి, నీరు కాలుష్యమై పర్యావరణం దెబ్బతింటుందని దాంతో తండా ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తండావాసుల అభిప్రాయాలు తెలుసుకోకుండానే కోళ్ల ఫామ్ నిర్మాణం చేపట్టడం సరికాదని వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని ముక్తకంఠంతో వ్యాఖ్యానించారు. కోళ్ల ఫామ్ నుంచి వచ్చే దుర్గంధమైన వాసన, దోమలు, ఈగలు తమ ఇళ్లల్లో వాలి చికెన్ గునియా, బర్డ్ ఫ్లూ, డెంగు లాంటి భయంకరమైన వైరస్ లు ప్రబలి తమ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడనుందని ముందు జాగ్రత్తగా నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆందోళన చేపడుతున్నట్లు వారు గోడును వెళ్లబుచ్చుకున్నారు. కోళ్ల ఫామ్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని తండాలో ఫ్లాకార్డులతో ర్యాలీ నిర్వహించి గ్రామపంచాయతీ కార్యదర్శి భూక్య మహేందర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ భూక్యా వెంకట్రాం, మాజీ ఎంపిటిసి భూక్యా క్రాంతి, నాయకులు డాక్టర్ భూక్యా రాజారాం నాయక్, భూక్యా రాజు, బదావత్ వీరన్న, భూక్యా కమల్ సింగ్, మూడు బాలాజీ, భూక్యా రవి, భూక్యా యాకు, భూక్యా నరసింహ, మాళోత్ సురేందర్, ఆంగోతు వెంకన్న, నూనావత్ స్వామి, భూక్యా లక్ష్మి, భూక్యా సుగుణమ్మ, భూక్యా రంజిత తదితరులు పాల్గొన్నారు.