మేడారంలో కొనసాగుతున్న ఉచిత వైద్య సేవలు

– జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య
నవతెలంగాణ- తాడ్వాయి 
మేడారంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పిలుపుమేరకు గత నెల జనవరి 14 నుండి ముందస్తుగా నే జాతర ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు, సందర్శకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య తెలిపారు. గురువారం మేడారంలోని కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని, జంపన్న వాగు వద్ద నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను సందర్శించి పరిశీలించారు. ఆయన దగ్గర ఉండి రోగులను పరీక్షించి ఉచిత మందులు పంపిణీ చేశారు. జాతరలో విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ పోలీస్ జవాన్ కు గాయం కాగా డాక్టర్ రంజిత్ వైద్య సేవలు అందించారు. అనంతరం కళ్యాణమండపంలో మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా మేస్త్రీలకు సరైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి అప్పయ్య మాట్లాడుతూ మేడారం మహా జాతరకు ముందస్తుగానే సుమారు 20 రోజుల నుండే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యపరంగా మహా జాతరలో సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతరకు వచ్చు సందర్శకులు, స్థానికులు, విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ క్రాంతి కుమార్, హెల్త్ సూపర్వైజర్ ఖలీల్, హెల్త్ అసిస్టెంట్ లు చేల తిరుపతయ్య, అనిల్, డ్యూటీ డాక్టర్ లు రంజిత్, వేణు, మల్లికార్జున్, శ్రీలత, ఫార్మసిస్ట్ కిరణ్, ఏఎన్ఎం లు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love