జేఎన్‌యూలో ప్రమోషన్ల వివాదం

Controversy over promotions in JNU– వర్సిటీ యంత్రాంగం తీరుపై అధ్యాపకుల ఆగ్రహం
– ఈనెల 19న నిరసనకు పిలుపు
న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లో పదోన్నతుల అంశం వివాదాన్ని రేపింది. ఇటీవలి ఒక ట్వీట్‌లో ప్రస్తుత వైస్‌ ఛాన్సలర్‌ పదవీకాలంలో 108 మంది అధ్యాపకులకు పదోన్నతి లభించినందుకు సంస్థ సంబరాలు చేసుకున్నదని వివరించింది. అయితే, విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఈ ప్రకటన జేన్‌యూలో పదోన్నతుల వాస్తవ స్థితిపై ప్రశ్నలు, ఆందోళనలను లేవనెత్తింది. ట్వీట్‌లో అందించిన సంఖ్యలు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. మొత్తం సమాచారాన్ని అందించినట్టు కనిపించలేదని కొందరు అధ్యాపకులు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జేఎన్‌యూ టీచర్స్‌ అసోసియేషన్‌ (జేఎన్‌యూటీఏ) స్టేట్‌ ఆఫ్‌ ది యూనివర్శిటీ నివేదికకు ప్రతిస్పందనగా సంస్థ నుంచి పై ట్వీట్‌ వచ్చింది. జేఎన్‌యూటీఏ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఈ నివేదిక అధ్యాపకుల పదోన్నతులతో అనేక సమస్యలను హైలైట్‌ చేసి పరిపాలన పురోగతి వాదనలను సవాలు చేసిందని స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్‌ల సంఖ్యకు సంబంధించి పారదర్శకత లేకపోవడం, ఈ ప్రమోషన్‌ల వ్యవధిని నిలుపుదల చేయడం నివేదికలో లేవనెత్తిన ఒక ముఖ్యమైన అంశం అని ప్రకటన పేర్కొన్నది.
గత రెండేండ్లలో 37 మంది అధ్యాపకులు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నుంచి ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారని యూనివర్సిటీ పేర్కొన్నది. అయితే, ప్రస్తుత వైస్‌ ఛాన్సలర్‌ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు 104 మందికి పైగా అసోసియేట్‌ ప్రొఫెసర్లు పదోన్నతి పొందవలసి ఉన్నదనీ, అదనంగా 21 మంది అర్హత సాధించారని జేఎన్‌యూటీఏ నివేదిక ఎత్తి చూపింది. దీనర్థం 70 శాతానికి పైగా అసోసియేట్‌ ప్రొఫెసర్‌లు ఇప్పటికీ తమ ప్రమోషన్‌ల కోసం వేచి ఉన్నారనీ, వాటిలో కొన్ని 2016 నుంచి పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. 15 మంది ఫ్యాకల్టీ సహౌద్యోగులకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నుంచి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించడాన్ని కూడా నివేదిక హైలైట్‌ చేసింది. అయితే, 2010 లేదా అంతకుముందు నుంచి జేఎన్‌యూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లుగా పనిచేసిన 47 మంది అధ్యాపకులు ఉన్నారనీ, 2022లో ప్రమోషన్‌కు అర్హులుగా ఉన్నారని వెల్లడించింది.
జేఎన్‌యూలో పదోన్నతుల భయంకరమైన స్థితికి.. అధ్యాపకుల పట్ల పరిపాలన యంత్రాంగం శత్రు వైఖరి కారణం అని జేఎన్‌యూ అధ్యాపకులు అభివర్ణించారు. గత సర్వీస్‌ల లెక్కింపు సహా సమస్యలను పరిష్కరించేందుకు పరిపాలన యంత్రాంగం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పదోన్నతుల విషయంలో పారదర్శకతకు పిలుపునిచ్చారు. ఈనెల 17న యూనివర్సిటీలో నిరసన దినంగా పాటించాలని జేఎన్‌యూటీఏ ప్రకటించింది. జేఎన్‌యూ ఉపాధ్యాయులందరూ తమ హక్కుల కోసం పోరాడేందుకు, తమ సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.

Spread the love