మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు…

నవతెలంగాణ – హైదరాబాద్
బ్రిటన్‌ను భయపెట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు భారత్‌లో కూడా విజృంభిస్తోంది. యూకేలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఎరిస్‌ (EG.5.1) అని పిలిచే ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో జూలై చివరినాటికి 70 యాక్టివ్ కేసులు ఉండగా.. ఆగస్టు 6 నాటికి ఆ సంఖ్య 115కు చేరింది. నిన్న ఆ సంఖ్య 106కి తగ్గింది. అయితే వీటిలో అత్యధిక కేసులు ముంబైలో నమోదయ్యాయి. ముంబైలో 43, పుణెలో 34, థానేలో 25 కేసులు నమోదయ్యాయి. రాయ్‌గడ్‌, సంగ్లీ, షోలాపూర్‌, సతారా, పాలఘఢ్‌లో ఒక్కో కొవిడ్‌-19 కేసు బయటపెడింది. ఒక్కసారిగా కరోనా కొత్త వేరియంట్‌ కేసులు పెరుగుతుండటంతో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి.. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీనియర్‌ అధికారి ఒకరు స్పందించారు. కేసులు పెరిగినంత మాత్రాన కొత్త వేరియంట్‌ విజృంభిస్తుందని అప్పుడే నిర్ధారించలేమని స్పష్టం చేశారు. ఒక వారం పాటు నమోదైన కేసులను పరిశీలించిన తర్వాతనే దీనిపై క్లారిటీ ఇవ్వగలమని పేర్కొన్నారు. సాధారణంగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యలో శ్వాస కోశ సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. నాలుగు ఐదు రోజులుగా కొవిడ్‌ కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నాయని చెప్పారు. ఎరిస్‌ వేరియంట్ తొలిసారిగా మే నెలలో బయటపడిందని మహారాష్ట్రలోని బీజే మెడికల్‌ కాలేజీకి చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త రాజేశ్‌ కార్యకర్తె తెలిపారు. అయితే అప్పటినుంచి ఇప్పటిదాకా కేసుల్లో గణనీయ పెరుగుదల మాత్రం లేదని స్పష్టం చేశారు.

Spread the love