ఆ విద్యార్థులకూ కౌన్సిలింగ్‌ చేయండి

ఆ విద్యార్థులకూ కౌన్సిలింగ్‌ చేయండి– యూపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ చేయలేదు : యోగి సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
– ముస్లిం బాలుడిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటనపై ఆదేశాలు3
లక్నో : హౌంవర్క్‌ చేయలేదని తరగతి ఉపాధ్యాయురాలు ఒక పాఠశాలలో ముస్లిం బాలుడిని తోటి విద్యార్థులతో చెంపదెబ్బ కొట్టించిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. యూపీలోని ముజఫర్‌నగర్‌లో గల ఒక పాఠశాలలో గతేడాది ఆగస్టులో ఈ ఘటన జరిగిన విషయం విదితమే. అమానుష ఘటనలో భాగమైన విద్యార్థులకు రాష్ట్ర సర్కారు కౌన్సిలింగ్‌ ఏర్పాటు చేయకపోవటాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ”మేము టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్స్‌) నివేదికను పరిశీలించాం. ఘటనలో భాగమైన అందరి విద్యార్థులకు కౌన్సిలింగ్‌కు సదరు నివేదిక పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు” అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అభరు ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ అన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం మార్చి 1కు వాయిదా వేసింది. అమానుష ఘటనలో భాగమైన విద్యార్థులకు కౌన్సిలింగ్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండో వారాల్లోగా సమ్మతి అఫిడవిట్‌ను దాఖలు చేయాలని తెలిపింది. విద్యార్థులకు కౌన్సిలింగ్‌ కోసం రెండు సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయని యూపీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ గరిమ పరిషద్‌ కోర్టుకు తెలిపారు. మరింత సమగ్ర అఫిడవిట్‌ దాఖలుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు.

Spread the love