వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి: సీపీఐ, రైతు సంఘం

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
కల్లాలలో ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి అని సీపీఐ నాయకులు, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం, యాదగిరిగుట్ట మండలంలోని మర్రిగూడెం, చోల్లేరు గ్రామాల సమీపంలో ఉన్నటువంటి ఐకెపి సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం నిల్వలను సిపిఐ, రైతు సంఘం నాయకులు పరిశీలించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి సెంటర్ల ద్వారా మిల్లర్లు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, మర్రిగూడెం సెంటర్లో  వడ్ల నిల్వలు ఉండడం వలన వర్షాలు పడితే ధాన్యంతడిచి మొలక వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరు రాజయ్య మాట్లాడుతూ ఆరుకాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ఇంకా ఐకెపి సెంటర్ల వద్ద ఉంచడం ఆందోళనకరమని ఈ ధాన్యాన్ని మిల్లర్లు తక్షణమే కొనుగోలు చేసి ఇక్కడ నుంచి తరలించాలని, వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని, దీనికొరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, వెంకటేష్ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభం అవుతున్నందున రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై ఇచ్చుటకు ఎటువంటి కొరత లేకుండా చూడాలని నకిలీ విత్తనాలను అరికట్టడం కొరకు ప్రత్యేక అధికారులను నియమించేలా చూడాలని, నకిలీ విత్తనాలను పూర్తిగా అరికట్టాలని కోరారు. ఈ ప్రతినిధి బృందం లో సీపీఐ మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్, సహాయ కార్యదర్శి పేరబోయిన మహేందర్, రైతు సంఘం నాయకులు మీసాల దాసు, బోదాసు స్వామి, లక్ష్మయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love