రాజస్థాన్‌లో సీపీఐ(ఎం) మెరుగైన ఫలితాలు

రాజస్థాన్‌లో సీపీఐ(ఎం) మెరుగైన ఫలితాలు– రాష్ట్ర కార్యదర్శి అమ్రారామ్‌
రాజస్థాన్‌లో సీపీఐ(ఎం) మంచి ఫలితాలు సాధిస్తుందని రాష్ట్ర కార్యదర్శి అమ్రారామ్‌ అన్నారు. ”రెండు సిట్టింగ్‌ స్థానాలతో కలిపి 17 నియోజకవర్గాల్లో సీపీఐ(ఎం) పోటీ చేస్తోంది. సీపీఐ(ఎం) అత్యుత్తమ ప్రదర్శన చేయడం ఖాయం. దాతరంగఢ్‌లో కూడా పరిస్థితి అనుకూలంగా ఉంది. కాంగ్రెస్‌ ఓట్లు చీలిపోతాయి. బీజేపీ అభ్యర్థికి ఆ నియోజకవర్గం గురించి పెద్దగా పరిచయం లేదు. దాతరంగఢ్‌లో నీటి కొరత తీవ్రంగా ఉంది. కాంగ్రెస్‌ నియోజకవర్గం అయినప్పటికీ నీటి కొరతను తీర్చేందుకు అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నీటి కొరతతో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి ఢిల్లీ, ముంబాయి వంటి నగరాలకు కూలీ పనుల కోసం వలస పోయారు. నిరుద్యోగం తాండవిస్తోంది. నియోజకవర్గంలో ఒక్క కళాశాల కూడా లేదు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇది ప్రచార దశలోనే అర్థమైంది. నియోజకవర్గంలోని మొత్తం 277 బూత్‌లలో సీపీఐ(ఎం) కమిటీలు ఉన్నాయి. కిసాన్‌సభ బలంగా ఉండడం కూడా సానుకూల అంశం. రైతాంగానికి నీరందించేందుకు కిసాన్‌సభ గత ఐదేండ్లలో ఎన్నో పోరాటాలు చేసింది.
దీంతో ఎక్కువ మంది రైతులు సీపీఐ(ఎం)కి చేరువయ్యారు” అని అమ్రారామ్‌ అన్నారు.

Spread the love