ఉద్యాన పంటలు,
చిరుధాన్యాల సాగు తగ్గడం ఆందోళనకరం
పంటల మార్పిడి తుది నివేదిక రూపకల్పన కోసం కసరత్తు చేస్తున్నాం : వ్యవసాయ నిపుణలతో సమావేశంలో రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి తప్పనిసరి అని రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి నొక్కి చెప్పారు. రైతులు మూసే పద్ధతిలో ఒకే పంటలను సాగు చేయడం, ఉద్యాన పంటలు, చిరుధాన్యాల సాగు తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో రాష్ట్రంలో పంటల మార్పిడి విధానం, భవిష్యత్ వ్యవసాయ ప్రణాళికలు, రైతుల ఆదాయాభివృద్ధికి సంబంధించిన తుది నివేదిక రూపొందించే అంశంపై వివిధ రంగాల నిపుణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగవుతున్న పంటల విధానం, నీటి లభ్యత, భూసార పరిస్థితులు, మార్కెట్ డిమాండ్, రైతుల ఆర్థిక స్థితి తదితర అంశాలను సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా పంటల మార్పిడి ద్వారా రైతుల ఆదాయం పెంపు, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, భూసార పరిరక్షణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను రూపొందించడం వంటి అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఉద్యాన పంటల విస్తరణ, మిల్లెట్లు, పప్పు దినుసుల సాగును ప్రోత్సహించడం, రైతులకు మార్కెట్ ఆధారిత పంటలపై అవగాహన కల్పించడం, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి విషయాలపై నిపుణులు పలు సూచనలు చేశారు. గ్రామీణ స్థాయిలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, సాగు ఖర్చులను తగ్గించే సాంకేతిక పద్ధతులను ప్రోత్సహించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను రూపకల్పన చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు. సమావేశంలో వచ్చిన సూచనలు, సిఫారసులను సమగ్రంగా పరిశీలించి తుది నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డి, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, మరికంటి భవానీ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. ఎక్కువ మంది రైతులు ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్క జొన్న వైపే వస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో పంటల మార్పిడి తప్పని సరి అని చెప్పారు. చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు అటు ఆవైపు మళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అజేయ కల్లం, వి. నాగిరెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి, రిటైర్డ్ అదనపు వ్యవసాయ సంచాలకులు నారాయణరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ మాజీ వైస్ చాన్సలర్ పి. రాఘవరెడ్డి, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బి. కృపాకర్ రెడ్డి హాజరై తమ విలువైన సూచనలు అందించారు.
పంటల మార్పిడి తప్పనిసరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



