Tuesday, May 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకళాకారుల డప్పు చప్పుళ్లకు ఢిల్లీ పీఠం కదలాలి

కళాకారుల డప్పు చప్పుళ్లకు ఢిల్లీ పీఠం కదలాలి

- Advertisement -


దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతదే
సమసమాజ ఏర్పాటు కోసం కళాకారులు పనిచేయాలి
తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర నాలుగో మహాసభలో సినీ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కళాకారుల పాత్ర కీలకం : ఎమ్మెల్యే కూనంనేని
‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సమసమాజమే స్థాపనే లక్ష్యంగా ఆవిర్భవించిన ప్రజా నాట్యమండలి కళాకారులంతా తమ డప్పుచప్పుళ్లతో, ఆటపాటలతో ఢిల్లీ పీఠం కదిలించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సినీదర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర నాలుగో మహాసభలు సోమవారం హైదరాబాద్ నారాయణగూడలోని మార్వెల్ ఫంక్షన్ హాల్‌‌లో ప్రారంభం అయ్యాయి. టీపీఎన్‌ఎమ్‌ ‌పతకాన్ని ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ ఎగురవేశారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ సాయుధ పోరాటంలో కళాకారులు ముఖ్య భూమిక పోషించారని తెలిపారు. నేడు దేశంలో కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు పెరిగిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడుకోవాల్సిని బాధ్యత యువతపై ఉందనీ, సమ సమాజ స్థాపన కోసం తమవంతుగా కళాకారులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలు కుల వివక్షత, వెట్టిచాకిరి, భూస్వాముల దురాగతాలు, దౌర్జన్యాలు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నాయకుడి కంటే ముందు కళా కారుడి గొంతు వెళ్లి నిలబడిందన్నారు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా)పై నిషేధం విధించిన తర్వాత తమ గొంతులను ఇతర వేదికల ద్వారా వినిపించేందుకు అనేక మంది ప్రజానాట్యమండలి కళాకారులు సినీ రంగం వైపు వెళ్లి అక్కడ రాణించారని చెప్పారు. కళాకారులంతా అణగారిన ప్రజల సమస్యలపై కళా రూపాలతో గొంతెత్తి నినదించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి సాంస్కృతిక, కళా సంస్థలకు మాతృక ప్రజానాట్యమండలేనని గుర్తు చేశారు. సాంస్కృతిక పరంగా కళలు ఎన్ని రూపాల్లో ఉన్నా అంతిమంగా మనిషికి మంచి జరగాలన్న గొప్ప లక్షం ప్రజానాట్యమండలిదన్నారు. చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ కళ కాసుల కోసం కాదు..కళ ప్రజల కోసమేనని పనిచేస్తున్న ప్రజానాట్యమండలి కళాకారులకు అభినందనలు తెలిపారు. సభలో తెలంగాణ ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహ, రాష్ట్రఅధ్యక్షులు కె.శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగంహేమంతరావు, కలవేన శంకర్, వి.ఎస్.బోస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎస్.ఛాయాదేవి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్, టీపీఎన్‌ఎమ్‌ ‌నాయకులు కన్నం లక్ష్మి నారాయణ, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కళారూపాలు
‌హిమాయత్‌‌నగర్లోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి నారాయణగూడ మార్వెల్‌ ఫంక్ష‍న్‌ ‌హాల్‌ ‌వరకు సాగిన తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారుల ర్యాలీ, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డబ్బు దరువుల మధ్య ఆట పాటలతో కళాకారులు ముందుకు సాగారు. మహాసభ వేదికపై పెద్దపల్లి జిల్లా ఒగ్గు కళాకారులు రేణా ఎల్లమ్మ కథను చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన కళాకారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై చిలుక జోస్యంతో సభికులను ఆలోచింపజేశారు. చిన్నారులు కోలాట ప్రదర్శన సభికుల్లో ఉత్సాహాన్ని నింపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -