Friday, July 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంగన్‌‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

అంగన్‌‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

- Advertisement -

టీచర్లు, ఆయాలతో జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించాలి : మంత్రి సీతక్క ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని అంగన్‌‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలనీ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గతేడాదిలో అద‌నంగా 5,938 కేంద్రాలకు టాయిలెట్ సదుపాయం, 3,815 కేంద్రాలకు తాగునీటి సదుపాయం, 14,271 కేంద్రాలకు విద్యుత్ సదుపాయం కల్పించినందుకు అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు. ప్రతి అంగన్‌‌వాడీ కేంద్రంలో వంద శాతం టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గురువారం హైదరాబాద్ లోని సచివాలయంలో అంగన్వాడీ కేంద్రాల మౌలిక వసతులు, సిబ్బంది నియామకాలు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల‌కు అందుతున్న పోషకాహారం, వారి ఎదుగుదలపై శాంపిల్ సర్వే నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. సర్వే ఫలితాల ఆధారంగా పోషకాహార కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలని సూచించారు. అంగన్వాడీ చిన్నారులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్ అందించే కార్యక్రమాలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాలను దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ప్రతి చిన్నారికి పోషకాహారం అందేలా చూడాలని ఆదేశించారు. చిన్నారుల ఉద‌యం ఆకలిని తీర్చడంతో పాటు వారి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడేలా బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి సూచించారు.

అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు, సేవల మెరుగుదలకు సంబంధించిన సూచనలను స్వీకరించి వాటి ఆధారంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. టీచర్లు, ఆయాల యూనిఫాంల‌ను అక్టోబర్ తొలి వారంలోగా సిద్ధం చేయాలని, అంగన్వాడీ టీచర్లకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిప్లొమా సర్టిఫికెట్లు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులను ఆకర్షించేలా పిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే ఆహ్లాదకరమైన రంగులు వేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లల అభ్యాసం, ఆటపాటలు, ఆరోగ్యం, పోషణకు అనువైన వాతావరణంగా మారాలని చెప్పారు. బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు వీలుగా ఇప్పటికే 54 తల్లి ఒడి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. అవసరమైన అన్ని జిల్లాలు, ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేసి బాలింతలకు సౌకర్యం కల్పించాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో అడాప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. తెలంగాణను బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, బాల్య వివాహాల నివారణపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

​నిధులను పూర్తిగా వినియోగించాలి
కేంద్రం నుంచి వచ్చే నిధులు వృథా కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి రూపాయి సమర్థవంతంగా వినియోగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా ఇద్దరు, ముగ్గురు అధికారులను నియమించాలని సూచించారు. క్షేత్రస్థాయి అధికారుల మధ్య సమన్వయం కోసం కూడా ప్రత్యేక బాధ్యతలు అప్పగించి, రోజువారీగా, ప్రతి వారం నివేదికలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారులు హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించాలని మంత్రి సూచించారు. ఎన్ని కేంద్రాలు, హాస్టళ్లను సందర్శించారు, అక్కడ గుర్తించిన సమస్యలు ఏమిటి, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు ఏమిటన్న వివరాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -