Thursday, August 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరహదారులతోనే పరిశ్రమల విస్తరణ

రహదారులతోనే పరిశ్రమల విస్తరణ

- Advertisement -

హైదరాబాద్‌ నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణంపై 
కేంద్ర మంత్రితో చర్చలు :
 మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మంత్రులు తుమ్మల, శ్రీధర్‌‌బాబుతో కలిసి పెద్దపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు
నవతెలంగాణ – సుల్తానాబాద్

​రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, రహదారుల అభివృద్ధితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి, సుల్తానాబాద్‌‌లో రూ.50కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను బుధవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌‌తో కలిసి మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రూ.13వేల కోట్లతో, పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో రూ.17వేల కోట్లతో రహదారి పనులు జరుగుతున్నాయని వివరించారు.
హెచ్‌ఏఎం విధానంలో ప్రభుత్వం 40 శాతం, కాంట్రాక్టర్‌ 60 శాతం నిధులు భరించే విధంగా పనులు చేపడుతున్నామని, ఇప్పుడు శంకుస్థాపన చేసిన రహదారి పనులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులను వదిలి వెళ్లిందని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి రామగుండం వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణంపై కేంద్ర మంత్రితో చర్చలు జరిపామని, ప్రతిపాదిత రహదారిలో సుల్తానాబాద్‌ బైపాస్‌ను కూడా మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో గోదావరి, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పది సంవత్సరాల్లో పెద్దపల్లి జిల్లాలో రూ.900 కోట్ల విలువైన రహదారి పనులు మాత్రమే మంజూరయ్యాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.1,700 కోట్ల విలువైన రహదారి పనులు మంజూరయ్యాయని తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్య గౌడ్‌, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చై‌ర్మెన్‌ రాధాకృష్ణ, పెద్దపల్లి మున్సిపల్ చై‌ర్మెన్‌ నూగిళ్ల మల్లయ్య, గోదావరిఖని డిప్యూటీ మేయర్‌ పారుపల్లి ఎల్లయ్య, మార్కెట్‌ కమిటీ చై‌ర్మెన్లు మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, సుల్తానాబాద్ వైస్ చై‌ర్మెన్‌ అంతటి పుష్పలత, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -