నేటితో ముగియనున్న టెండర్ ప్రక్రియ మత్స్యకారులకు తగ్గుతున్న ఆదాయం
ఈసారీ ఆలస్యమే..
మూడేండ్లుగా నష్టపోతున్న వైనం
గతేడాది ఆలస్యంగా
50 శాతమే పంపిణీ
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే ఉచిత చేప పిల్లల పంపిణీ ఈ యేడాది కూడా ఆలస్యం అవుతోంది. జులై, ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాల్సి ఉండగా మూడేండ్లుగా ప్రభుత్వం నవంబర్, డిసెంబర్ నెలల్లో చేప పిల్లలు ఇస్తోంది. దీంతో మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతోంది. టెండర్ ద్వారా చేపట్టే ప్రక్రియలో జాప్యం కారణంగా ప్రతి యేటా ఆలస్యం కావడంతో చేపల ఎదుగుదల తగ్గి ఆదాయం రాక ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని చేపల వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు టెండర్ ప్రక్రియ పూర్తి కాకపోతే మరో మూడు నెలల వరకు చేపలు చెరువుకు రానట్టే.
గతేడాది టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరుకు సమయానికి బిల్లు రాక 50 శాతం చేప పిల్లలనే పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో గుత్తేదారులు ఉచిత చేప పిల్లల పంపిణీ టెండర్‌కు ముందుకు రావడం లేదని తెలుస్తోం.
ఆదిలాబాద్ జిల్లా మొత్తం 40 వేల మంది వరకు మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం సకాలంలో అందక ఆర్థికంగా చితికి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేప పిల్లల పంపిణీ ఆలస్యం కావడంతో మూడేండ్లుగా మత్స్యకారులు నష్టాలను చవిచూస్తున్నారు. ఏజెన్సీలో గిరిజనులు సైతం ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 283 చెరువులు ఉండగా 107 మత్స్యకార సంఘాలు పనిచేస్తున్నాయి. 114 చెరువులు సంఘాల పరిధిలో ఉండగా.. మరో 169 చెరువులు ఉన్నాయి. అంతేకాకుండా మూడు ప్రాజెక్టులు సాత్నాల, మత్తడివాగు, దహెగాం ప్రాజెక్టులు ఉన్నాయి. సాత్నాల ప్రాజెక్టులోనే ప్రతి ఏటా 25 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా పపిణీ చేస్తోంది. 107 సంఘాల్లో 5044 మంది సభ్యులు ఉన్నారు. ఆ సంఘాల ద్వారా చెరువులకు లీజు రూపంలో మత్స్యశాఖకు రూ.2.83 లక్షల ఆదాయం సమకూరుతోంది. ఒక్కో చెరువుకు లీజు రూపంలో రూ.రెండు వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తారు.
నేటితో టెండర్ పూర్తవుతుంది
సాంబశివరావు, జిల్లా మత్స్య శాఖ ఇన్‌చార్జి అధికారి
ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీకి ఆన్‌లైన్ ద్వారా టెండర్లు స్వీకరిస్తోంది. ఈనెల 17న చివరి గడువు కాగా.. సెలవులు రావడంతో ప్రభుత్వం 20వ తేదీ వరకు పొడిగించింది. గురువారం 3 గంటలకు టెండర్ ప్రక్రియ ముగిసిన తరువాత ఎంతమంది టెండర్‌లో పాల్గొంటున్నారనేది తేలుతుంది. ఇప్పటి వరకు మూడు టెండర్లు దాఖలైనట్టు తెలిసింది. టెండర్ దక్కించుకున్న వారు రెండు రకాల సైజ్ చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉంది.
నేటితో ముగియనున్న టెండర్ ప్రక్రియ
జిల్లాలో చెరువులకు ప్రభుత్వం ఉచితంగా కోటి 16 లక్షల చేపపిల్లలను పంపిణీ చేయాల్సి ఉంది. దీనికి ఆన్‌లైన్ టెండర్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ నెల 17 వరకు టెండర్ ప్రక్రియ నిర్వహించగా సెలవులు రావడంతో 20 వరకు గడువు పెంచారు. ఇప్పటివరకు మూడు టెండర్లు మాత్రమే వచ్చినట్టు అధికారులు తెలుపుతున్నారు. టెండర్ దక్కించుకున్నవారు రెండు రకాల చేపపిల్లలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్‌లైన్ టెండర్ వేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఒక వేల ప్రభుత్వం గడువు పెంచకపోతే ఎంత మంది టెండర్ వేశారో గురువారం తేలనుంది. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. నవంబర్ నెలలో చేపపిల్లలను పంపిణీ చేశారు. దాంతో రెండు కిలోల వరకు పెరగాల్సిన చేప కిలో వరకే పెరగడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది కూడా ఇలాంటి పరిస్థితే నెలకొననున్నట్టు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలస్యం కావడంతో ఎదుగుదల లేదు
ఎల్లుల భోజన్న, గంగపుత్ర సంఘం అధ్యక్షులు ఆదిలాబాద్
చేప పిల్లల పంపిణీ ఆలస్యం కావడంతో వాటి ఎదుగుదల తగ్గి తీవ్రంగా నష్టపోతున్నాం. జులై నెలలో చెరువులో వదలాల్సిన చేపపిల్లలను మూడు సంవత్సరాలుగా నవంబర్‌లో వదులుతున్నారు. టెండర్ అయిన రెండు మూడు నెలలకు చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ముందస్తుగా టెండర్ వేసి మత్స్యకారుల అర్థిక అభివృద్ధికి సహకరించాలి.
బిల్లులు చెల్లించకనే జాప్యం
మేకల అశోక్, గంగపుత్ర సంఘం జిల్లా కార్యదర్శి
ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీకి నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు టెండర్లు వేసేందుకు ముందుకు రావడం లేదు. టెండర్ దక్కించుకున్న వారు పూర్తి స్థాయిలో పంపిణీ చేయక బిల్లులు నిలిచి పోతున్నాయి. చెరువులు టెండర్ తీసుకున్న గుత్తేదారులు ఉచిత చేపపిల్లల కోసం ఎదురు చూడకుండా ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారు.
చెరువుకు చేరని చేపపిల్లలు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



