Thursday, August 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంత్వరలో అందుబాటులోకి 
మూసారంబాగ్‌ వంతెన

త్వరలో అందుబాటులోకి 
మూసారంబాగ్‌ వంతెన

- Advertisement -


ట్రాఫిక్‌ సమస్యలు, వరద కష్టాలకు చెక్‌
మరో పది రోజుల్లో 
హై లెవల్ వంతెన పనులు పూర్తి
ఏ1 ర్యాంప్ బీటీ పనులు కంప్లీట్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

​మూసీ వరదలు, ట్రాఫిక్‌ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా హైదరాబాద్‌ మూసారంబాగ్‌ హైలెవల్‌ వంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. సుమారు రూ.52 కోట్లతో నిర్మిస్తున్న ఆరు లైన్ల వంతెనపై బీటీ పనులు కొనసాగుతున్నాయి.. మరో 10 రోజుల్లో నిర్మాణ పనులు పూర్తిచేసి ఈ నెలాఖరులోగా వాహన రాకపోకలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
వంతెన డెక్ స్లాబ్ పై వేరింగ్ కోట్ బీటీ -బీసీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అంబర్‌‌పేట్‌ వైపు ఉన్న ఏ1 ర్యాంప్ పై బీటీ పనులు ఇప్పటికే పూర్తికాగా, ‌మలక్‌‌పేట్‌ వైపు ఏ2 ర్యాంప్ పై బీటీ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు మరో 10రోజుల్లో పూర్తి అవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రధాన వంతెనతోపాటు ఇరువైపులా ర్యాంప్ నిర్మాణాలు దాదాపు పూర్తికానున్నాయి. 220 మీటర్ల పొడవు, 29.5 మీటర్ల వెడల్పుతో వంతెనను రూపొందించగా, ఇరువైపులా 3.5 మీటర్ల ఫుట్‌‌పాత్‌‌లు, 20 మీటర్ల క్యారేజ్వీ ఉండేలా ప్రణాళిక రూపొందించారు. అంబర్‌‌పేట్‌, మూసారంబాగ్, మలక్‌‌పేట్‌, ‌దిల్‌‌సుఖ్‌నగర్‌ ‌తదితర ప్రాంతాల మధ్య రాకపోకలకు ఈ వంతెన అత్యంత కీలకం. గతంలో వర్షాలు, మూసీ వరదల సమయంలో పాత కాజ్ వే తరచూ నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేది. కాజ్ వేపై వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చేది. పాత కాజ్‌‌వే దెబ్బతినడంతో దాన్ని తొలగించి కొత్త హైలెవల్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

​కమిషనర్‌ ‌ప్రత్యేక చొరవ.. చకచకా పనులు పూర్తి
వర్షాకాలంలో మూసీనది ఉప్పొంగిన ప్రతిసారీ మూసారంబాగ్‌, అంబర్‌‌పేట్ రహదారుల్లో ప్రయాణీకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ బ్రిడ్జి పూర్తయితే వాహనదారులకు, స్థానికులకు మూసీ కష్టాలు తీరినట్టే. నిర్మాణ పనులను వేగవంతం వేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌‌వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. ఆయన ప్రత్యేక చొరవతో వంతెన నిర్మాణాన్ని రెండు భాగాలుగా విభజించి పనులు మొదలు పెట్టారు. జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ ‌సహదేవ్‌ ‌రత్నాకర్‌ ఎప్పటికప్పుడూ ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేయడంతో పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే వంతెనకు సంబంధించిన కీలక నిర్మాణ పనులు పూర్తికావడంతో ప్రస్తుతం రహదారి నిర్మాణానికి సంబంధించిన తుది పనులపై దృష్టి సారించారు. అంబర్‌‌పేట్‌ వైపు ఏ1 ర్యాంప్ బీటీ పనులు పూర్తి కావడంతో ఆ వైపు అనుసంధానం సిద్ధమైంది. మలక్‌‌పేట్‌ వైపు ఏ2 ర్యాంప్ పనులు పూర్తయితే వంతెనకు ఇరువైపులా రహదారి కనెక్టివిటీ ఏర్పడనుంది. ఇంకా రోడ్డు మార్కింగులు, లైటింగ్, డ్రయినేజీ, భద్రతా బ్యారియర్లు, ఇతర తుది ఏర్పాట్లు పూర్తిచేయాల్సి ఉంటుంది. సంబంధిత విభాగాల పరిశీలనలు, భద్రతా ఏర్పాట్లు పూర్తయిన తర్వాత వంతెనను అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే అంబర్‌‌పేట్‌ నుంచి మూసారంబాగ్, ‌మలక్‌‌పేట్‌ వైపు, మరోవైపు మలక్‌‌పేట్‌ నుంచి అంబర్‌‌పేట్‌, దిల్‌‌సుఖ్‌నగర్‌ పరిసర ప్రాంతాల వైపు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -