సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు పిలుపు
ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు నిర్వహణ ఆర్టీసీలకు అప్పగించాలి : ఎస్.వీరయ్య
నవతెలంగాణ-గాంధీ చౌక్
38 వేల మంది ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తును నిర్ణయించడానికి ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయని, కార్మిక సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాడుతూ, వారి హక్కుల పరిరక్షణ, ఆర్టీసీ సంస్థ రక్షణే ధ్యేయంగా ఐక్య పోరాటాల సారథిగా ఉన్న స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌ను (ఎస్‌డబ్ల్యూఎఫ్) కార్మికులందరూ బలపరచాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మంలోని మంచికంటి హాల్‌లో ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు అధ్యక్షతన జరిగిన యూనియన్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా ఖమ్మం పాత బస్టాండ్ నుండి మంచికంటి భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో వీరాంజనేయులు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా ప్రతినిధులందరూ మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం సాయిబాబు ప్రసంగిస్తూ.. 2019లో ఆనాటి ప్రభుత్వం కార్మిక సంఘాలపై ఆంక్షలు విధిస్తే, ఆర్టీసీలోని సంఘాలన్నీ మౌనం పాటించాయని, కేవలం ఎస్‌డబ్ల్యూఎఫ్ మాత్రమే తన శక్తి మేరకు కార్మిక సమస్యలపై స్పందించి పోరాడిందని గుర్తుచేశారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ సుదీర్ఘకాల పోరాటాల వల్లే 2026లో సమ్మె జరిగిందన్నారు. త్వరలో జరగనున్న గుర్తింపు ఎన్నికల్లో కార్మికుల వైపు నిలిచే కార్మిక సంఘం కావాలా.. ప్రభుత్వానికి, యాజమాన్యాలకు అనుకూలంగా ఉండే సంఘాలు కావాలో కార్మికులు ఆలోచన చేయాలన్నారు. ఆర్టీసీలో కార్మికులు రిటైర్ అయ్యి ఏండ్లు గడుస్తున్నా వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం అత్యంత బాధాకరమన్నారు. నష్టాల పేరుతో కార్మికులపై పనిభారాలు పెంచడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే పెంచిన పనిభారాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ పేరుతో ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతుందన్నారు. కానీ, పర్యావరణానికి మనమేమీ వ్యతిరేకం కాదని కేవలం ఆర్టీసీని రక్షించాలని మాత్రమే మనం అడుగుతున్నామన్నారు. అందుకనే కేంద్ర ప్రభుత్వ పాలసీని మార్పుచేసి ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు నిర్వహణ ఆర్టీసీలకు అప్పగించాలని కోరారు. అందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాలని, ఆ రకంగా ప్రజా రవాణా సంస్థ ప్రజల సంస్థ ఆర్టీసీని రక్షించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, కార్యదర్శి నివేదిక ప్రవేశ పెడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల పని పరిస్థితులు, పెరిగిన పనిభారాలు సమస్యల పట్ల యూనియన్ల వైఖరి, విలీనం అంశం, యాజమాన్యం అంగీకరించి అంశాల అమలు విషయాలు వివరించారు. ప్రభుత్వంలో విలీనం అంశంపై సమగ్రమైన అధ్యయనం చేసి స్పష్టమైన వైఖరితో ఉన్న ఏకైక సంఘం ఎస్‌డబ్ల్యూఎఫ్ మాత్రమేనని అన్నారు. అనంతరం కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. బ్రెడ్ విన్నర్స్ స్కీంలో నియామకం పొందిన వారందరినీ వారి అపాయింట్‌మెంట్ డేట్ నుండి రెగ్యులర్ చేయాలని, ఈడీల కమిటీ అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలని, 80శాతం పెంచిన అలవెన్స్‌ల పెంపుదలకు సర్క్యూలర్ విడుదల చేయాలని, జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ పాస్ అయిన వారందరికీ పోస్టింగులు ఇవ్వాలని తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో ఎస్‌డబ్య్లూఎఫ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ లింగమూర్తి, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఆర్టీసీ శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ జె.పద్మావతి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణాల రాంబాబు, వేము జాకబ్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కళ్యాణం వెంకటేశ్వర్లు, తుమ్మ విష్ణువర్ధన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్, ఖమ్మం రీజియన్ అధ్యక్ష కార్యదర్శులు గుండు మాధవరావు, పిట్టల సుధాకర్, నల్లగొండ జిల్లా కార్యదర్శి సలీం, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు బత్తుల సుధాకర్, గీత, ఉపేంద్రాచారి, ఎల్లయ్య ఖమ్మం రీజియన్ నాయకులు డి.సరిత, కురువటి ప్రతాప్, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి రీజియన్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ పరిరక్షణ కోసం ఎస్‌డబ్ల్యూఎఫ్‌ను బలపరచండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



