30 శాతం లోటు వర్షపాతం…అడుగంటిన భూగర్భజలం
ప్రత్యామ్నాయ పంటల సాగును క్షేత్రస్థాయిలో ప్రోత్సహించాలి
విత్తనాలను 75 శాతం రాయితీపై ఇవ్వండి
డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహించేందుకు రూ.402 కోట్లు కేటాయించండి
ప్రభుత్వానికి నివేదించిన నిపుణుల కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం తీవ్రస్థాయిలో ఉందనీ, నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు, రైతులను ఆదుకునేందుకు రూ.802.92 కోట్లను కేటాయించాలని ఎల్‌నినోపై డాక్టర్ జి. చిన్నారెడ్డి నేతృత్వంలో వేసిన నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి నివేదికను అందజేసింది. రాష్ట్రంలో 33 జిల్లాలుండగా 23 జిల్లాల్లో(621 మండలాలకుగానూ 399 మండలాల్లో) లోటు వర్షపాతం ఉందనీ, చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతింటున్నాయని నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో సాధారణ నైరుతి రుతుపవనాల వర్షపాతం 740.60 మిల్లీమీటర్లు కాగా, జులై 27 నాటికి 234.80 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదై, సాధారణంతో పోలిస్తే సుమారు 30 శాతం లోటు నమోదైనట్లు తెలిపింది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం 23 శాతానికిపైగా తగ్గిందని చెప్పింది. రాష్ట్రంలోని అత్యధిక జిల్లాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయనీ, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో పాటు భూగర్భ జలమట్టం కూడా గణనీయంగా పడిపోయినట్లు నివేదికలో వివరించింది. వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గినందున, నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలకు బదులుగా కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, నూనెగింజలు, కూరగాయలు, పశుగ్రాస పంటలు వంటి ప్రత్యామ్నాయ పంటలను గ్రామాల వారీ కార్యాచరణ ప్రణాళికతో విస్తృతంగా ప్రోత్సహించాలని కమిటీ సూచించింది.
ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను 75 శాతం వరకు సబ్సిడీపై రైతులకు అందించాలని సిఫారసు చేసింది. వరి సాగును నీటి లభ్యత ఆధారంగా పరిమితం చేయడంతో పాటు డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలని, బ్రాడ్ బెడ్ అండ్ ఫరో, రిడ్జ్ అండ్ ఫరో, మల్చింగ్, వర్షపు నీటి సంరక్షణ, ఫార్మ్ పాండ్లు, భూగర్భ జలాల రీఛార్జ్ వంటి నీటి సంరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని నివేదిక సూచించింది. ఉద్యాన పంటల సాగును విస్తరించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించవచ్చని కమిటీ అభిప్రాయపడింది. తక్కువ వ్యవధి కూరగాయల సాగు, ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, పట్టుపరిశ్రమ ఆధారిత సాగును ప్రోత్సహించాలని, డ్రిప్ ఇరిగేషన్, శాశ్వత పందిళ్లు, షేడ్‌నెట్ హౌస్‌లు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలకు సబ్సిడీలు అందించాలని సూచించింది. పశుసంవర్ధక రంగంలో పశుగ్రాస కొరత తలెత్తకుండా జిల్లా వారీగా పశుగ్రాస బ్యాంకులు ఏర్పాటు చేయడం, మేత పంటల సాగును విస్తరించడం, సైలేజ్, హే తయారీ, అజోల్లా సాగు, పశుగ్రాస విత్తనాల పంపిణీ, అవసరమైతే పశు శిబిరాల నిర్వహణ, పశువులకు తాగునీటి వసతుల కల్పన వంటి చర్యలు చేపట్టాలని కమిటీ సిఫార్సు చేసింది.
గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చెక్‌డ్యాంలు, ఫార్మ్‌పాండ్లు, చెరువుల పూడికతీత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్ పనులను విస్తృతంగా చేపట్టి నీటి వనరులను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించాలని సూచించింది. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జలాశయాల్లోని నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత కల్పించాలని నివేదిక పేర్కొంది. ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అవసరమైతే మార్కెట్ జోక్యంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. అదే విధంగా వర్షాభావం కారణంగా పంట నష్టం వాటిల్లిన 32.20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో, అత్యవసర పరిస్థితుల్లో వేసే విత్తనాలను (కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు) 1.21 లక్షల క్వింటాళ్ల మేర సేకరించి పంపిణీ చేయడానికి రూ. 329.18 కోట్ల (75శాతం రాయితీ) కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించింది. మైక్రో ఇరిగేషన్, వాటర్‌షెడ్లు, వ్యవసాయ కుంటలు, బోరుబావి రీఛార్జ్ నిర్మాణాలు, సోలార్ ఫెన్సింగ్, సోలార్ పంప్ సెట్లు వంటి వాటికి ఆర్థిక మద్దతు అందించాలనీ, చేతికొచ్చిన పంటలను రక్షించుకునేందుకు సూక్ష్మ నీటిపారుదల మల్చింగ్ పద్ధతులను 75 శాతం రాయితీతో చేపట్టేలా రూ. 452.80 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని సూచించింది.
అందులో డ్రిప్ ఇరిగేషన్ కు (రూ. 402.00 కోట్లు), స్ప్రింక్లర్ ఇరిగేషన్ (రూ. 50.00 కోట్లు) మల్చింగ్ (రూ. 0.80 కోట్లు) ఉన్నాయి. రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రసాయనాల అధిక వినియోగం వల్ల కలిగే పర్యావరణ దుష్ప్రభావాలను తగ్గించడానికి జిల్లాకు 100 చొప్పున మొత్తం 3200 వర్మీకంపోస్ట్ యూనిట్ల ఏర్పాటును 100శాతం రాయితీతో ప్రోత్సహించేందుకు రూ. 5.12 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని సూచించింది. రూ. 15 కోట్ల వ్యయంతో కూరగాయల పందిళ్ల నిర్మాణానికి 75 శాతం రాయితీ కల్పించి ఆ పంటల సాగును ప్రోత్సహించాలని కోరింది. అత్యవసర పరిస్థితుల్లో సాగు చేసే పంటలకు భరోసాతో కూడిన మార్కెట్ మద్దతు కల్పించడానికీ, పంట వైవిధ్యీకరణను సులభతరం చేయడానికి సమగ్ర సేకరణ విధానాన్ని రూపొందించాలని విన్నవించింది.



