Friday, July 31, 2026
E-PAPER
Homeజాతీయంఅమిత్ షా మౌనం దేనికి?

అమిత్ షా మౌనం దేనికి?

- Advertisement -

ఢిల్లీ ఘటనపై నోరు విప్పాలి
విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా? వారిపై లాఠీఛార్జ్‌‌కు ఆయనే బాధ్యుడు
పేపర్‌ ‌లీక్‌ను ఫాస్ట్‌‌ట్రాక్‌ ‌ కోర్టులు పరిష్కరించవు ప్రభుత్వం అప్రకటిత
ఎమర్జెన్సీని విధించింది రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నీట్ ప్రశ్న పత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై బాష్పవా యువు కూడా ప్రయోగించారని తెలిపారు. పోలీసుల తీరుపై కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. గురువారం రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026 (యాంటీ పేపర్ లీక్ లా)ను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభ ఆమోదం కోసం తీసుకొచ్చారు. విద్యార్థులు, యువత సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు ఈ బిల్లే నిదర్శనం అని మంత్రి జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. విద్యార్థుల ప్రయోజనాల్ని ఉన్నతంగా కాపాడేందుకు, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు అని ఆయన అన్నారు. పేపర్ల లీకులను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, వీటిని సహించేది లేదని తెలిపారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేయబోమన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి పారదర్శకత కోసమే ఈ బిల్లు తెచ్చామన్నారు. దేశంలో యూపీఎస్సీ, ఆర్బీఐ, ఐబీపీఎస్‌, ఎన్‌‌టీఏ వంటి నాలుగు ప్రధానమైన నియామక, పరీక్షల నిర్వహణ సంస్థలు ఉన్నాయని చెప్పారు.

​విద్యార్థులకు జరిగిన నష్టాన్ని 
ఎవరు భర్తీ చేయాలి? : ఖర్గే
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ వంటి దారుణ ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత అని స్పష్టం చేశారు. దీనిపై ఇంతవరకూ ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఘటనపై నోరు విప్పి మాట్లా డాలంటూ అమిత్‌ షాను ఖర్గే డిమాండ్ చేశారు. పేపర్‌ లీక్‌ వల్ల విద్యార్థులు నష్టపోవాలా? అని కేంద్రాన్ని నిలదీశారు. చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? అని ప్రభుత్వాన్ని ఖర్గే ప్రశ్నించారు. పేపర్‌ లీక్‌ అనేది తలదించుకోవాల్సిన అంశమని అన్నారు.

​‘మోడీ, షాలకు విద్యార్థులు గుణపాఠం చెప్తారు’
ఈ బిల్లును 2024లోనే ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు కోసం తపన తప్ప విద్యార్థులపై ప్రేమ లేదని కేంద్ర వైఖరిని తప్పుబట్టారు. బీహార్‌లో ఆందోళనకు దిగిన విద్యార్థులపై తుపాకులు ఎక్కుబెట్టారని విమర్శించారు. ఆందోళన చేసిన యువత ఉగ్రవాదులు కాదు కదా? అని కేంద్రానికి ఖర్గే చురకలంటించారు. పోలీసుల చ‌ర్య‌ల‌పై ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మౌనాన్ని వీడాల‌ని, లేదంటే మ‌ళ్లీ విద్యార్థులు గుణ‌పాఠం చెప్తారని హెచ్చ‌రించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

​​పిల్లల భవిష్యత్తు పట్టని కేంద్రం.. 
రాజకీయాల పైనే దృష్టి
బీజేపీ రాకీయాల వ‌ల్లే దేశంలో లీకులు, నిర‌స‌న‌లు, లాఠీఛార్జ్‌లు జ‌రుగుతున్న‌ట్టు ఖర్గే ఆరోపించారు. నిర‌స‌న‌కారుల‌కు జ‌రిగిన ప్ర‌తి గాయానికి ప్ర‌భుత్వానిదే బాధ్య‌త అన్నారు. కేంద్ర స‌ర్కారు రాజ‌కీయాల్లో నిమ‌గ్న‌మైంద‌ని, కానీ పిల్ల‌ల భ‌విష్య‌త్తును విస్మ‌రించింద‌న్నారు. నిర‌స‌న‌ల‌ను నియంత్రించేందుకు బిల్లు తెచ్చారని, కానీ విద్యా వ్య‌వ‌స్థలో సంస్క‌ర‌ణ‌ల కోసం కాద‌ని ఆయన ఆరోపించారు. విద్యా సంస్థ‌ల‌కు ఆర్ఎస్ఎస్ వ్య‌క్తులు నేతృత్వం వ‌హిస్తున్నార‌ని, వారిని తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. స్కూళ్లు, యూనివ‌ర్సిటీల సిల‌బ‌స్‌లో మార్పులు జ‌రుగుతున్నాయ‌ని, మ‌నుస్మృతి ప్ర‌కారం ఆ మార్పులు చేస్తున్న‌ట్టు ఖర్గే ఆరోపిం చారు. విద్యా వ్య‌వ‌స్థ‌లో కుల వివ‌క్ష‌ను మ‌నుస్మృతి ప్రోత్స‌హించిన‌ట్టు ఆరోపిం చారు. అయితే ఆ వ్యాఖ్య‌ల‌ను ట్రెజ‌రీ స‌భ్యులు ఖండించారు. దీంతో స‌భ‌లో కాసేపు గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. మ‌ను స్మృతిపై ఖ‌ర్గే చేసిన వ్యాఖ్య‌ల‌ను రాజ్య‌స‌భ రికార్డుల నుంచి తొల‌గించాల‌ని స‌భాప‌క్ష నేత జెపి న‌డ్డా కోరారు. రాజ్య‌స‌భ చైర్మెన్ సిపి రాధాకృష్ణ‌న్ మాట్లాడుతూ… చ‌ర్చ‌లో మ‌నుస్మృతి ప్ర‌స్తావ‌న సంబంధం లేని అంశ‌మ‌ని, అధికారిక రికార్డుల నుంచి ఆ వ్యాఖ్య‌ల‌ను తొల‌గిస్తున్న‌ట్టు చెప్పారు.

​ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? 
సంజయ్ రౌత్
విద్యార్థుల నిరసనల పట్ల ప్రభుత్వం ఎందుకు అంతగా భయపడుతోందని శివసేన (థాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. చాలా మంది పార్లమెంటు సభ్యులు తమ రాజకీయ ప్రస్థానాన్ని విద్యార్థి ఉద్యమాల నుంచే ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. “అలాంటప్పుడు ఇప్పుడు మనం వారిని చూసి ఎందుకు భయపడుతున్నాం?” అని ప్రశ్నించారు. “లాఠీలు, బాష్పవాయువు, పెల్లెట్లతో విద్యార్థులపై దాడులు జరుగుతుంటే కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ఎందుకు ఎలాంటి ప్రకటనా చేయలేదు?” అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.

​పారదర్శకత, జవాబుదారీతనం ముఖ్యం: మహువా మాఝీ
ప్రశ్నపత్రం లీక్ చేసే ముఠాలకు శిక్షను పెంచే ఉద్దేశంతో ‘పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు’ను ప్రవేశపెట్టినప్పటికీ, అది సరిపోదని జేఎంఎం ఎంపీ మహువా మాఝీ అన్నారు. నివారణ, పారదర్శకత, జవాబుదారీతనం అనేవి మరింత ముఖ్యమని ఆమె తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం ఫిన్లాండ్, సింగపూర్, దక్షిణ కొరియా వంటి దేశాలు తమ విద్యా విధానాలను ఎలా మార్చుకున్నాయో ప్రస్తావించారు. పేపర్ లీక్‌లను అరికట్టడానికి విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, దానిని డిజిటలైజ్ చేయాలని సూచించారు.

​ఎన్‌‌టీఏను రద్దు చేయాలి : మనోజ్ కుమార్ ఝా
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌‌టీఏ)ని రద్దు చేయాలని ఆర్డేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా డిమాండ్ చేశారు. పేపర్ లీక్ సమస్యను నివారణ దశ నుంచి పూర్తిగా నిర్మూలించే దశకు తీసుకువెళ్లలేకపోతున్నామని అన్నారు. సోషల్ మీడియాలో వీడియోలు చేయడం లేదా యువత (జెన్ జీ) మాట్లాడే భాషను అనుకరించడం వారికి అవసరం లేదని, తమ సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వారు కోరుకుంటున్నారని అన్నారు. ఈసారి ఒక మంత్రి పదవి పోతే, వచ్చేసారి మొత్తం ప్రభుత్వమే కూలిపోతుందని హెచ్చరించారు. 53-54 ఏండ్ల వయసులో గెట్ అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం గురించి విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరితో జరిగిన సంభాషణను ఆయన గుర్తు చేశారు. కానీ, ఎలాంటి పరీక్షలు రాయకుండానే వైస్-ఛాన్సలర్లు విశ్వవిద్యా లయాలకు నాయ కత్వం వహిస్తున్నారని ఆయన ఎత్తిచూపారు.

​ప్రభుత్వం ఉగ్రవాదుల్లా వ్యవహరించింది: సంజయ్ సింగ్
గత పదేండ్లలో ఆత్మహత్యలు చేసుకున్న 1.23 లక్షల మంది విద్యార్థులకు నివాళులు అర్పించడంతో తన ప్రసంగాన్ని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రారంభించారు. ఫాస్ట్-ట్రాక్ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసుల భారాన్ని, అలాగే విద్య, పాఠశాలల్లో వసతుల కొరతను ప్రస్తావించారు. “భారత్‌ నిరక్షరాస్య దేశంగా మారినప్పుడే, అది ‘అంధభక్తుల’ (విచక్షణ లేని అనుచరుల) దేశంగా మారుతుంది” అని ‌సంజయ్‌ సింగ్ అన్నారు. ఢిల్లీ, బీహార్‌లలో విద్యార్థుల నిరసనల సమయంలో ప్రయోగించిన అధిక బలప్రయోగంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. “బీహార్‌లో పోలీసులు విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు జరిపారు. ప్రభుత్వం ఉగ్రవాదుల మాదిరిగా వ్యవహరించింది” అని విమర్శించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో పరీక్షలు నిర్వహించి, ఆ మూడు రాష్ట్రాల్లోనూ ‘బ్లాక్‌లిస్ట్’ చేయబడిన ఎడ్యుటెస్ట్ సంస్థపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వం చూపిన పక్షపాతం కారణంగానే ఆ సంస్థకు పరీక్షల నిర్వహణ కాంట్రాక్టులు లభిస్తూ వచ్చాయని ఆయన ఆరోపించారు.
​వైద్య విద్య ప్రవేశ పరీక్షలను నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించాలి : 
ఎస్పీ ఎంపీ రామ్‌ ‌గోపాల్‌ ‌యాదవ్‌ నీట్ ను రద్దు చేసి, వైద్య విద్య ప్రవేశ పరీక్షలను నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించాలని ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. నేరాలకు కేవలం శిక్షలను పెంచడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. శిక్షలను పెంచడం మాత్రమే నేరాలు జరగకుండా ఆపలేదని అన్నారు.

​విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు: తిరుచ్చి శివ
నిరసన సమయంలో పెల్లెట్ గన్‌లను ఉపయోగించలేదని పేర్కొంటూ బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ సభను ఎలా తప్పుదోవ పట్టించారో తనకు అర్థం కావడం లేదని డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ అన్నారు. “పెల్లెట్ గన్‌ల వల్ల గాయపడిన వారికి చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది” అని ఆయన గుర్తుచేశారు. విద్యార్థులకు ఇచ్చిన రెండు హామీలలో ఒకటి.. వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవడమనేది ఇంకా నెరవేరలేదని అన్నారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టే బిల్లు విద్యార్థులపై ఉండే మానసిక ఒత్తిడిని మార్చలేదు కాబట్టి, అది నిష్ప్రయోజనమని ఆయన పేర్కొన్నారు. నీట్ పరీక్షను రద్దు చేయడమే డీఎంకే విధానమని కూడా ఆయన తెలిపారు. ఈ బిల్లుపై చర్చలో జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా, ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్, శివసేన ఎంపీ మిలింద్ దేవరా, బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది, టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీజేడీ ఎంపీ సంతృప్తి మిశ్రా, టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ చౌదరి మహ్మద్, స్వతంత ఎంపీ కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -