Thursday, August 20, 2026
E-PAPER
Homeజాతీయంఉప్పునకు బదులు డిటర్జెంట్‌..

ఉప్పునకు బదులు డిటర్జెంట్‌..

- Advertisement -

40 మంది విద్యార్థులకు అస్వస్థత
కడుపునొప్పి, వాంతులు..ఆస్పత్రికి తరలింపు
బీహార్‌లో మధ్యాహ్న భోజనంలో ఘోర నిర్లక్ష్యం

పాట్నా : పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన పాఠశాల మధ్యాహ్న భోజన పథకంలో ఘోర నిర్లక్ష్యం బయటపడింది. బీజేపీ పాలిత బీహార్‌ రాష్ట్రంలో ఇది చోటు చేసుకుంది. నలందా జిల్లాలో మధ్యాహ్న భోజనంలో ఉప్పునకు బదులుగా డిటర్జెంట్‌ పౌడర్‌ వడ్డించిన ఘటన కలకలం రేపింది. పరాసి మిడిల్‌ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం చేసిన కనీసం 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో బాధపడు తున్న విద్యార్థులను వెంటనే బీహార్‌ షరీఫ్‌ మోడల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పాఠశాలకు మధ్యాహ్న భోజనం మరో స్కూల్‌ నుంచి సరఫరా చేసినట్టు అధికారులు తెలిపారు. భోజనంలో భాగంగా వడ్డించిన సోయాబీన్‌ కూరలో ఉప్పు తక్కువగా ఉందని విద్యార్థులు గుర్తించారు. దీంతోమరికొంత ఉప్పు కావాలని కోరారు. అయితే ఉప్పు స్థానంలో అక్కడ ఉన్న డిటర్జెంట్‌ పౌడర్‌ను పొరపాటున వడ్డించినట్టు ఓ ఉపాధ్యాయుడు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఏమి వడ్డించారో తెలియక విద్యార్థులు దానిని భోజనంలో కలుపుకొని తిన్నారు. కొద్దిసేపటికే పలువురు విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయి. పాఠశాల సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఘటన విషయం తెలుసుకున్న బీహార్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్‌ కుమార్‌.. ఆస్పత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఘటనకు బాధ్యులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -