వరద సహాయక చర్యలపై
మంత్రి శ్రీధర్‌బాబు వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గోదావరిఖని, పెద్దపల్లి, సింగరేణి ఏరియాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు కాలనీలు జలమయమైన నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారంనాడాయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ర్ట సచివాలయం నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్, సింగరేణి సీఎండీ, ఎన్‌టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ జెన్‌కో సీఎండీ, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) అధికారులు, రామగుండం పోలీసు కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట వెంకటరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామికవాడలో నిలిచిపోయిన వరద నీరు తొలగించేందుకు నాలాల్లో ఉన్న ఆటంకాలను తొలగించాలని మంత్రి ఆదేశించారు. వరద సహాయక చర్యల్లో సింగరేణి, ఎన్‌టీపీసీ అధికారులు చురుకుగా పాల్గొని జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. వీర్లపల్లి గ్రామంలోని నివాస ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో గ్రామంలోకి వరద నీరు చేరకుండా ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించే చర్యలు చేపట్టాలనీ, గ్రామస్తులు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా ఇంటి స్థలాల పట్టాలు అందజేసే ప్రక్రియను వేగవంతం చేయాలని పెద్దపల్లి కలెక్టర్‌కు సూచించారు.
గోదావరిఖనిలో వరద తీవ్రత అధికంగా ఉన్నందున మున్సిపల్, రెవెన్యూ శాఖలకు పోలీసులు పూర్తి సహకారం అందించాలని చెప్పారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలనీ, విపత్తు నివారణ బృందాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని 1,021 చెరువులు దాదాపు 80 శాతం నిండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆ నీటితో జిల్లాలోని సుమారు 2.7 లక్షల ఎకరాలకు సాగునీటి కొరత ఉండదన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు గురువారం సాయంత్రానికి 20 టీఎంసీలకు చేరనున్నాయని తెలిపారు. నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఒక్క చుక్క నీరూ వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని సింగరేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ప్రజా ప్రతినిధులు వరద సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని చెప్పారు. ఇప్పటికే ఆ పని చేస్తున్న రామగుండం మేయర్, డిప్యూటి మేయర్, కార్పోరేటర్లను మంత్రి అభినందించారు.



