Saturday, June 20, 2026
E-PAPER
Homeఖమ్మంరూ. కోట్లకు పంగనామం..! 

రూ. కోట్లకు పంగనామం..! 

- Advertisement -

– ఐపీ పెట్టి, ఆస్తులు అమ్మేందుకు నయా మోసానికి తెగబడిన వ్యాపారి 
– నమ్మి అప్పులిచ్చిన బాధితులకు నమ్మకద్రోహం
– సత్తుపల్లి మండలం గంగారంలో వెలుగుచూసిన ఘరానా మోసం
– కోర్టును, బాధితులను పక్కదారి పట్టిస్తూ ఆస్తుల విక్రయానికి యత్నం!
– లబోదిబోమంటున్న అప్పులిచ్చిన బాధితులు

నవతెలంగాణ – సత్తుపల్లి:- స్థానికంగా పెద్ద వ్యాపారవేత్త అని, కోట్లాది రూపాయల స్థిరాస్తులు ఉన్నాయని, పాపం అక్కడి జనాలు నమ్మారు. నమ్మి అప్పులిచ్చిన వాళ్లను నట్టేట ముంచేయడానికి ఒక కిలాడీ వ్యాపారి నయా మోసానికి తెరలేపాడు. సత్తుపల్లి మండలం, గంగారం గ్రామంలో మెస్సర్స్ రామకృష్ణ ట్రేడర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం నిర్వహిస్తున్న ముల్లంగి సాంబశివారెడ్డి అనే వ్యక్తి తన వ్యాపార, కుటుంబ అవసరాల సాకుతో అడ్డగోలుగా అప్పులు చేసి, నమ్మి అప్పులిచ్చిన బాధితులను నట్టేట ముంచేందుకు బరితెగించాడు.

సదరు కిలాడి వ్యాపారి​సాంబశివారెడ్డి చెక్కులు, ప్రామిసరీ నోట్లను ఎరగా వేసి, ఒకరికొకరికి తెలియకుండా సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లోని పలువురి వద్ద సుమారు రూ. 2కోట్ల  వరకు భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. స్థానికంగా పెద్ద ఎత్తున ఎరువుల వ్యాపారం చేస్తుండటం, చేతి నిండా ఆస్తులు ఉండటంతో అతడి మాటలు నమ్మిన బాధితులు లక్షలాది రూపాయలను ఆ మాయలోడి చేతిలో పెట్టారు. గడువు ముగిసినా నయాపైసా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీయడం ప్రారంభించారు. స్థానికంగా ఆరా తీయగా సాంబశివారెడ్డి అసలు స్వరూపం బయటపడింది. అతను ఇలాగే చాలా మంది వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టాడనే నిజం తెలిసి బాధితులు షాక్‌కు గురయ్యారు.

ఐపీ డ్రామా.. తెరవెనుక అసలు భాగోతం!
బాధితులు తమకు రావలసిన డబ్బుల కోసం ఒత్తిడి పెంచడంతో, సాంబశివారెడ్డి కొత్త డ్రామాకు తెరలేపాడు. బాధితుల సొమ్మును ఎగ్గొట్టాలనే దురుద్దేశంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఐపీ (ఇన్సాల్వెన్సీ పిటిషన్- 17/2022) దాఖలు చేశాడు.

​కోర్టును సైతం బురిడీ కొట్టిస్తూ ఆస్తుల విక్రయానికి తెర వెనుక ప్రయత్నాలు 
​కోర్టులో ఐపీ దాఖలు చేసి, తనకు ఆస్తులు ఉన్నాయని సదరు దావాలో చూపించిన సాంబశివారెడ్డి  లోపాయికారీగా మరో ఘోరానికి ఒడిగట్టాడు. కోర్టు పరిధిలో ఉన్న ఆస్తులను, ఎవరికీ తెలియకుండా ఇతరులకు విక్రయించడానికి తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవైపు కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తూ, మరోవైపు బాధితులను నిలువునా ముంచుతూ ఆస్తులు అమ్ముకోవడానికి సిద్ధపడటం అతని మోసపూరిత వైఖరికి నిదర్శనం.

​న్యాయం చేయాలంటూ బాధితుల ఆవేదన!
​సాంబశివారెడ్డి నమ్మకద్రోహం వల్ల తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని, రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని బాధితులు మోరంపూడి ఇందిర, గువ్వల పద్మారెడ్డి,  తేజావత్ నాగేశ్వరరావు,  వంకదారు వాసుదేవరావు,  ఉప్పు నరేష్,  ఓరుగంటి వెంకటేశ్వరరావు,  ఎస్కే నాగుల్ మీరా, పొదిలి జయమ్మ, కోలగట్ల చెన్నారావు, కె.  సాంబశివరావు, మానికల రాంబాబు, ఎస్కే బాబా, ఎస్కే కాసీం, డాక్టర్ జనార్ధన్, వంకదారు గోపాలరావు  లబోదిబోమంటున్నారు. కోర్టును, చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఆస్తులు విక్రయానికి ప్రయత్నిస్తున్న సాంబశివారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకొని తమకు రావాల్సిన కోట్లాది రూపాయల సొమ్మును ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఎమ్మెల్యే, సబ్ రిజిస్ట్రార్ బాధితుల వినతి 
సాంబశివారెడ్డి చేతిలో మోసపోయిన బాధితులు శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, సబ్ రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ లను కలిసి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -