రోజువారి సీఎంఆర్ లక్ష్యాన్ని సాధించాలి..

– కస్టమ్స్ మిల్లింగ్ రైస్ ప్రగతి పై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ-భువనగిరి రూరల్ : రోజు వారి పర్యవేక్షణతో  సీఎంఆర్ లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. సోమవారం నాడు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో కలసి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో కష్టమ్ మిల్లింగ్ రైస్ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ జరిపించి, కోటా మేరకు భారత ఆహార సంస్థ (ఎఫ్ సీ ఐ) కు  బియ్యం  చేరవేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. గత డిసెంబర్ 31 నాటికే ఎఫ్.సి.ఐకి సీ.ఎం.ఆర్ కోటాను చేరవేయాల్సి ఉన్నప్పటికీ, అనేక జిల్లాలలో మిల్లింగ్ ప్రక్రియ పెద్ద ఎత్తున పెండింగ్లోనే ఉండిపోయిందని, ఎఫ్.సీ.ఐ గడువు పొడిగించినందున, నిర్ణీత సమయం లోగా కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలు చేరేలా చూడాలన్నారు. ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రైస్ మిల్లుల వారీగా పర్యవేక్షణ జరపాలని, మిల్లర్లు పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు మిల్లింగ్ జరిపేలా కృషి చేయాలని, రైస్ మిల్లులను అధికారులు నిరంతరం సందర్శిస్తూ, పూర్తి స్థాయిలో మిల్లింగ్ జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. కేటాయించిన ధాన్యం నిల్వలను పరిశీలించాలని, ఎక్కడైనా పక్కదారి పట్టించినట్లు, అక్రమాలకు పాల్పడినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ దందాను నిరోధించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద కుటుంబాలకు అందించే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఉంచాలని, పోలీసు అధికారులను సమన్వయము చేస్తూ, అక్రమార్కులను గుర్తించి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ అభయహస్తం కింద 5 గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా, రోజు వారీగా నమోదును పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయంలోగా కంప్యూటరీకరణ పూర్తి చేయించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ ఏ భాస్కరరావు,  జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి,  జిల్లా పంచాయతీ అధికారి సునంద, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గోపి కృష్ణ, జిల్లా సరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Spread the love