కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం

Deadly fire in Kuwait– 50 మంది సజీవ దహనం..
– వారిలో 40 మంది భారతీయులే
– అందులో కేరళ వాసులు 25 మంది
కువైట్‌ : వారంతా పొట్టకూటి కోసం కన్నవారిని, సొంత ఊరిని, దేశాన్ని వదిలొచ్చారు. ఓ కంపెనీలో పని చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. కానీ దురదష్టవశాత్తూ జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో సజీవదహనమయ్యారు. ఈ విషాద ఘటన కువైట్‌లో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఓ భవనంలో మంటలు చెలరేగడంతో 50 మంది కాలి బూడిదయ్యారు. వారిలో 40 మంది భారతీయులు కాగా 25 మంది కేరళా వాసులే కావడం గమనార్హం.
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ మంగాఫ్‌ నగరంలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తొలుత కిచెన్‌లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 44 మంది మంటల్లో సజీవదహనమవ్వగా.. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలోనూ 30 మంది భారతీయులే ఉన్నారు. మతుల్లో 40 మంది భారతీయులేనని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో 160 మంది ఉండగా, అందులో చాలా మంది ఇంకా నిద్రలోనే ఉన్నారు. వీరంతా ఒకే కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటన జరిగిన భవనం కువైట్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థకు చెందినదిగా సమాచారం.
విదేశాంగ మంత్రి దిగ్భ్రాంతి
అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషయం తెలిసిన వెంటనే కువైట్‌లోని భారతీయ రాయబారి ఘటనా స్థలాన్ని సందర్శించారని.. బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

 

Spread the love