– ఏ.విజయరాఘవన్, బి.వెంకట్ సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ స్వామినాథన్ మృతికి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఏ.విజయరాఘవన్, ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం వ్యవసాయ రంగ అభివృద్ధికి తీరని లోటని పేర్కొన్నారు. గురువారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆహారోత్పత్తిలో దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడంలో స్వామినాథన్ చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం ఎమ్‌ఎస్‌పీ, సీప్లస్‌సీ ఫార్ములా రూపొందించడంలో వ్యవసాయ కమిషన్ చైర్మెన్‌గా కీలక పాత్ర పోషించారని తెలిపారు. అఖిల భారత స్థాయిలో వివిధ భావాలు కలిగిన రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక, ప్రజా సంఘాలను ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. స్వామినాథన్ అగ్రేరియన్ స్టడీ సెంటర్ పేరుతో ఆహార పంటలతోపాటు భూ సమస్యలు, ఉపాధి అవకాశాలపై రూపొందించిన నివేదికలు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. మధుర స్వామినాథన్ ప్రజా పంపిణీ వ్యవస్థ, గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు వంటి అంశాలపై ప్రత్యేక అధ్య యనం చేశారనీ, వీకే రామచంద్రన్ ఆధ్వర్యంలో నడుపుతున్న ఎఫ్‌ఏఎస్, వ్యవసాయ కార్మిక సంఘాలతో సత్సంబంధాలున్నాయని తెలిపారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధరల చట్ట సాధన కోసం, వ్యవసాయ కార్మికులకు ఉపాధి, ఆహార భద్రత వంటి గ్యారెంటీ పథకాలను అమలు చేసుకోవడం కోసం దేశవ్యాప్త బలమైన ఉద్యమాలను నిర్వహించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
స్వామినాథన్‌తోనే ఆహారభద్రత వ్యవసాయ, సాగునీటిరంగ నిపుణులు : సారంపల్లి మల్లారెడ్డి
హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత ఎం.ఎస్.స్వామినాథన్ మృతి వ్యవసాయ ప్రపంచానికి తీరనిలోటు. వ్యవసాయంరంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత ఆయనదే. రైతులకు గిట్టుబాటు ధర ఉండాలని మొదటి నుంచి చెబుతున్నారు. అమెరికాకు చెందిన బోర్లాగ్, చైనాకు చెందిన లాంగ్‌పింగ్ శాస్త్రవేత్తలతోపాటు స్వామినాథన్ కృషిమూలంగా ప్రపంచంలో ఆహారభద్రత నెలకొంది. ఉత్పత్తిని నాలుగైదు రెట్లు పెంచారు. కొరత లేకుండా చేశారు. మద్ధతు ధర కింద ఉత్పత్తి ధరలో 50 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ సిఫారసులను ఆమోదించిన కేంద్ర సర్కారు, అమలుచేయకుండా రైతులను మోసం చేసింది.