నిర్ణయాలు కలిసి తీసుకుంటేనే…

సంసారమన్నాక మనస్పర్థలు, గొడవలు సహజం. అయితే దంపతుల్లో ఎవరో ఒకరు రాజీపడి వీటిని సద్దుమణిగేలా చేస్తేనే కాపురం సజావుగా ముందుకు సాగుతుంది. కానీ ఇలా అర్థం చేసుకునే తత్వమున్న దంపతులు ఈ కాలంలో చాలా అరుదుగానే కనిపిస్తున్నారంటున్నారు నిపుణులు. ఇందుకు ఆర్థిక స్వాతంత్య్రం, అసూయాద్వేషాలు, పురుషాధిపత్యం.. వంటివెన్నో కారణాలు కావచ్చు. అయితే వీటి కారణంగా ఇద్దరి మధ్య పలు విషయాల్లో వచ్చే చిన్న చిన్న భేదాభిప్రాయాలు అనుబంధాన్ని తెగే దాకా లాగుతున్నాయని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మరి, ఇలా జరగకూడదంటే ఈ కాలపు దంపతులు కొన్ని విషయాలు దష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. మరి  వేంటో
తెలుసుకుందాం…
ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతుంది జంట. అన్యోన్య దాంపత్యానికీ.. కలిసి ఆనందంగా సాగడానికీ బోలెడు ప్రణాళికలు వేసుకుంటారు. అయితే కొంత మంది భర్తలు అన్ని విషయాలు భార్యలకు చెప్పిన డబ్బు విషయం వచ్చే సరికి ఆమెకు చెప్పేదేంటి అనుకుంటారు. కానీ అన్నింటితో పాటు ఆర్థిక విషయాలు కూడా భాగస్వాములిద్దరూ ఒకరినొకరు పంచుకోవాలంటున్నారు నిపుణులు. అప్పుడే మనస్పర్థలకు తావుండదంటున్నారు.
అలాగే వదిలేస్తే…
వివాహ బంధమంటే ఎన్నో బరువు బాధ్యతలతో కూడుకున్నది. పెండ్లి కాక ముందు వరకు ఎలా ఉన్నా.. పెండ్లయ్యాక మాత్రం దంపతులిద్దరూ ఒకరికొకరు కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం తప్పనిసరని అర్థం చేసుకోవాలి. అయితే ఈ కాలపు దంపతుల్లో ఇది కొరవడుతోందని చెబుతున్నారు నిపుణులు. ఒకరి మాటలు-అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించకపోవడం, పరిణతితో ఆలోచించలేకపోవడం వంటివే ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. అయితే వీటిని ఇలాగే వదిలేస్తే జీవితాలే నాశనం కావొచ్చు. అనుబంధాలు దూరం కావొచ్చు. కాబట్టి ఇలాంటి కలతల్ని దూరం చేసుకోవాలంటే ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటేనే సాధ్యమవుతుంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరిలో ఒకరు కాస్త మొండిగా ఉన్నా.. మరొకరు ఓ మెట్టు దిగితే తప్పు లేదు. దీని వల్ల వచ్చే సమస్యలేమీ లేవు. నేను తగ్గేదేంటి అనే ధోరణి వదిలెయ్యాలి. దీని ఫలితంగా గొడవలూ సద్దుమణుగుతాయి. ఎదుటివారూ మీ ఓపికను అర్థం చేసుకొని వారి ప్రవర్తననూ క్రమంగా మార్చుకునే అవకాశాలుంటాయి.
దాపరికాలు వద్దు
ఇప్పటి జంటల్లో భేదాభిప్రాయాలు రావడానికి ముఖ్య కారణమేదైనా ఉంది అంటే అది డబ్బే అంటున్నారు నిపుణులు. ఇద్దరూ రెండు చేతులా సంపాదించడం, పొదుపు-మదుపు విషయాల్లో ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకోవడం వల్ల.. ఇద్దరి మధ్య దూరం అగాథంలా పెరిగిపోతోంది. ఒకానొక దశలో ఇది బయటపడి తెగతెంపుల దాకా వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే భార్యాభర్తలిద్దరూ ఎవరెంత సంపాదించినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత పొదుపు చేసినా.. దాపరికం లేకుండా అన్ని విషయాలు పంచుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం అంటున్నారు నిపుణులు. అలాగే ఆస్తులు కొన్నా, రుణాలు చెల్లించినా.. కలిసే పెట్టుబడి పెట్టడం వల్ల ఇద్దరూ బాధ్యతాయుతంగా వ్యవహరించే అవకాశముంటుంది. ఈ కలుపుగోలుతనమే ఆలుమగలిద్దరినీ శాశ్వతంగా కలిపి ఉంచుతుంది.
ఇలాంటి విభజన వద్దు
ఇల్లు నిర్వహణ నువ్వు.. సంపాదన సంగతి నేను.. ఇలా విభజించుకున్నప్పుడే సమస్యలు. ఇద్దరూ ఉద్యోగాలు చేసినా, చేయకపోయినా పొదుపు, మదుపు, కొనుగోళ్లు వంటి నిర్ణయాలేవైనా ఇద్దరూ కలిసి తీసుకోవాలి. అప్పుడు ప్రతి రూపాయి లెక్క తెలియడమే కాదు.. మెరుగైన ప్రణాళికకీ ఆస్కారం ఉంటుంది. కొత్తలో కలిసి పర్యటనలు, షాపింగ్‌ వంటివి సహజమే. అలాగని మరీ ఖర్చు చేసుకుంటూ వెళ్లొద్దు. కొనేది ఏదైనా నిజంగా అవసరమేనా అని ప్రశ్నించుకుంటే దుబారాకి చోటుండదు. నగరాల్లో ఉండేవారికి కరెంటు కోతలు పెద్దగా పరిచయం ఉండదు. ఇష్టమొచ్చినట్లుగా లైట్లు, ఫ్యాన్లు వేసి వదిలేస్తుంటారు. మీకూ ఆ అలవాటు ఉంటే తగ్గించుకోండి. ఇంట్లోకి వస్తువులు కొనేప్పుడూ కరెంటు ఆదా చేసే రకాలను ఎంచుకోండి. కరెంటు బిల్లు తగ్గుతుంది. ఇంకా ఇలాంటి వథాలేం చేస్తున్నారో తెలుసుకున్నా చాలావరకూ ఆదా చేయొచ్చు. ఇవి ఏవైనా ఇద్దరూ పాటించండి. అప్పుడు సంసారం ఆర్థిక సమస్యలు లేకుండా, ఎలాంటి గొడవలు రాకుండా సజావుగా సాగిపోతుంది.
ఒక పుస్తకాన్ని పెట్టుకోండి
ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారన్నది ఓ పుస్తకం పెట్టుకుని ఇద్దరూ అందులో కచ్చితంగా రాయాలనే నియమం పెట్టుకోండి. దీని ద్వారా నెలకు ఎంత అవసరం అన్న సంగతే కాదు.. అనవసర ఖర్చుల వివరాలూ తెలుస్తాయి. వీలైతే వాటిని తగ్గించుకొని పొదుపుగా మలుచుకోవచ్చు. ఇద్దరూ సంపాదిస్తోంటే.. ఏ బాధ్యతలూ లేకపోతే ఒకరి జీతాన్ని పూర్తిగా పక్కన పెట్టేయొచ్చు. భవిష్యత్తులో సొంత ఇల్లు, స్థలం వంటివి ప్లాన్‌ చేసుకున్నా డబ్బుపరంగా ఇబ్బంది ఉండదు. అయితే ఏ నిర్ణయం అయినా ఇద్దరూ కలిసి తీసుకోసుకోవాలి అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. అప్పుడు ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలూ రావు.

Spread the love