– జూన్ త్రైమాసికంలో 3.24 శాతం తగ్గుదల
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన అన్ని రంగాల ఎగుమతులు డీలా పడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 3.24 శాతం పడిపోయి 5.88 బిలియన్ డాలర్ల (రూ.49వేల కోట్లు)కు పరిమితమయ్యాయి. ఎర్ర సముద్ర సంక్షోభం కారణంగా సరుకు రవాణా ఖర్చు పెరగడం, బియ్యం ఎగుమతులపై ఆంక్షలు, విదేశాల్లో మొక్కజొన్నకు ధర తగ్గడం తదితర కారణాల వల్ల ఎగుమతుల్లో తగ్గుదల చోటు చేసుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) కింద ఉన్న మాంసం, పాలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, తాజా పండ్లు, కూరగాయల ఎగుమతులు పెరిగాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. గడిచిన తొలి త్రైమాసికంలో బియ్యం ఎగుమతులు స్వల్పంగా 0.46 శాతం తగ్గి 2.82 బిలియన్ డాలర్లు (రూ.23.600 కోట్లు)గా నమోదయ్యాయి.
బాస్మతి బియ్యంకు గ్లోబల్ డిమాండ్ ఉండటంతో 2024-25 ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో 13 శాతం పెరిగి 1.03 బిలియన్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై ఆంక్షల కారణంగా 13 శాతం 1.06 బిలియన్లు (రూ.8874 కోట్లు)గా నమోదయ్యాయి. గత సంవత్సరం, దేశీయ సరఫరాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తెల్ల, బ్రోకెన్ రైస్ ఎగుమతులపై నిషేధం విధించింది. పార్బాయిల్డ్ రైస్‌పై 20 శాతం రవాణా సుంకాలను విధించింది. గత అక్టోబర్ నుంచి బాస్మతి బియ్యం ఎగుమతులపై కనీస ఎగుమతి ధరను టన్నుకు 950 డాలర్లు (రూ.80వేలు)గా నిర్ణయించింది.
అంతర్జాతీయ ధరల కారణంగా మొక్కజొన్నతో సహా ఇతర తృణధాన్యాల ఎగుమతులు 76 శాతం తగ్గి 251 మిలియన్లకు పడిపోయాయి. వేరుశెనగ ఎగుమతులు 16 శాతం క్షీణించి 136 మిలియన్లుగా, పప్పు ధాన్యాలు 5 శాతం తగ్గి 143 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఆరు నెలల తర్వాత తాము గత సంవత్సరం ఎగుమతులను అధిగమించగలుగుతామని వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.