– అకౌంట్‌లో డబ్బులు పడక ఆందోళనలో అన్నదాత శ్రీ సర్వే తప్పిదాలు రైతులకు శాపాలు
నవతెలంగాణ-భైంసా
లక్ష రూపాయల లోపు రైతులకు రుణమాఫీ జరిగినప్పటికీ కొందరికి రుణమాఫీ డబ్బులు అందక ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఆధార్, రేషన్‌కార్డును అనుసంధానంగా తీసుకోవడంతో బ్యాంకు అకౌంట్‌లో పేరు తప్పిదంతో నిర్దారణ జరగలేదంటూ వారి డబ్బులు ఖాతాల్లో జమకు నోచుకోలేదు. దీంతో తమకు రుణమాఫీ వస్తుందా? లేదా అని రైతులు ఆధార్ కార్డు పట్టుకొని వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్తున్నారు. ఇలా వందలో 25 శాతం మంది రైతులకు కుటుంబ సభ్యుల నిర్ధారణ జరగలేదని, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ రైతు పేరులో తేడా ఉందని రికార్డుల్లో ఉంది. దీంతో కొంతమంది రైతులు తమకు రుణమాఫీ వస్తుందా లేదా అని ఆందోళనకు గురవుతున్నారు. ఖరీఫ్ ప్రారంభం కావడం, రైతులంతా కష్టకాలంలో ఉన్న సమయంలో ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నప్పటికీ కొన్ని తప్పిదాల వల్ల కొందరు రైతులు రుణమాఫీకి నోచుకోవడం లేదు. ఏడు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించలేదు. ఆన్‌లైన్‌లో తప్పిదం మూలంగా రేషన్ కార్డులో కుటుంబ యజమాని పేరు మిస్ కావడంతో రుణమాఫీకి సంబంధించిన వ్యవసాయ శాఖ రికార్డుల్లో కుటుంబ సభ్యుల నిర్ధారణ జరగకపోవడంతో రుణమాఫీకి అర్హులమవుతామా? లేదా? అన్న ఆందోళన రైతులకు మొదలైంది. గ్రామాల్లో పెద్ద మొత్తంలో రైతుల రుణమాఫీ వివరాలు ఇదేవిధంగా ఉండటంతో టెన్షన్ మొదలైంది. విచారణ చేపడతామని వ్యవసాయ అధికారులు తెలియజేసినప్పటికీ, ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ డబ్బులు వేస్తుండడంతో ఇలా రైతుల పేర్లు మిస్ కావడంతో పూర్తిస్థాయిలో రుణమాఫీ అందడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు తక్షణం సర్వే చేపట్టి వెనువెంటనే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి రుణమాఫీ చేయిస్తే రైతుకు కొంత న్యాయం జరుగుతుంది. నిర్ధారణ పేరిట ప్రభుత్వం కొందరు రుణాలను ఆపేసి జాప్యం చేస్తుందని రైతులు వాపోతున్నారు. నిర్ధారణ పేరిట రుణమాఫీ జాప్యం చేయవద్దని, సమస్యను తక్షణం పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.