గుండ్ల సింగారంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా దశలవారీ ఆందోళనలు
కూల్చిన చోటే వారికి ఇండ్లు నిర్మించాలి
లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
వామపక్ష పార్టీల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణను పూరిండ్లు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఒకవైపు చెబుతూనే..మరోవైపు పడావుబడ్డ ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేయించటం అత్యంత దుర్మార్గమని వామపక్ష పార్టీలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. హనుమకొండలోని గుండ్ల సింగారంలో ఇటీవల గుడిసెలను కూల్చివేయటం దారుణమని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వామపక్ష పార్టీల నేతలు పేదల పట్ల సర్కార్ అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. గతంలోనూ పేదలు వేసుకున్న ఇండ్లను అప్రజాస్వామికంగా తొలగిం చారని గుర్తు చేశారు. మహబూబాబాద్, గోపాల్‌పూర్, జక్కలొద్ది, సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, నర్సంపేట పలు చోట్ల ప్రభుత్వ అధికారులు, పోలీసులు దాడులు చేసి ఇండ్లు నేలమట్టం చేశారని తెలిపారు. గూడు లేని పేదలపై కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించారని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని విమర్శించారు.ఈ చర్యలకు నిరసనగా ఈ నెల 27న వరంగల్, హన్మకొండ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నట్టు తెలిపారు. వచ్చే నెల 1న అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ధర్నాలు నిర్వహించాలనీ,6న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత సీఎంను కలుస్తామని తెలిపారు. ఇదో దీర్ఘకాలిక పోరాటంగా కొనసాగిస్తామని చెప్పారు. అధికారంలో ఉన్నాం కదా… ఏం చేసినా చెల్లుతుందిలే అనుకుంటే కుదరదని హెచ్చరించారు. వెలుగు మట్లలో లాగా కూల్చిన చోటనే తిరిగి లబ్దిదారులకు ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలేసుకున్న ప్రతి ఒక్కరికి పట్టా ఇవ్వాలని కోరారు. లేదంటే విద్యుత్ ఉద్యమం తరహాలో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. 2007లో జరిగిన భూపోరాటంలో నాటి ప్రభుత్వం ముదిగొండలో ఏడుగురి పేదలను కాల్చి చంపిందని గుర్తు చేశారు. ఆ పోరాటం ఫలితంగా ఇండ్లు లేని పేదలకు ఇందిరిమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. కానీ..ఆచరణలో అమలు కావటం లేదని తెలిపారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతోపాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, ఎన్‌డీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె గోవర్దన్, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్,ఎస్‌యూసీఐ నాయకులు భరత్ తదితరులు మాట్లాడారు.
పేదల ఇండ్లు కూల్చటం దుర్మార్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



